కాజల్ పని అయిపోయిందనుకున్న ప్రతీసారి ఇద్దరు స్టార్స్ ఆదుకున్నారు. పెద్ద హీరోలు మొహం చాటేసి చిన్న సినిమాలతో సరిపెట్టుకుంటున్న టైమ్ లో మేమున్నామంటూ ఛాన్సులిస్తున్నారు. ఒక హీరో అయితే కాజల్ తో నాలుగోసారి జత కట్టేందుకు రెడీ అవుతున్నాడు. మరో సీనియర్ స్టార్ రెండోసారి నటిస్తున్నాడు. అదేమిటో గానీ ఫేడౌట్ అయిన ప్రతీసారి.. కోలుకుంటూ కెరీర్ నిలెబెట్టుకుంటోంది ఈ చందమామ. 

 

ఒకసారి ట్రాక్ తప్పితే.. మళ్లీ పట్టాలెక్కడం అంత ఈజీ కాదు. చేతిలో సినిమాలైపోతున్నాయని అనుకున్న ప్రతీసారి.. చిరంజీవి.. విజయ్ లాంటి స్టార్స్ ఈ అమ్మడితో జతకట్టి ప్రోత్సహిస్తున్నారు. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 కోసం చాలామంది హీరోయిన్స్ ను అనుకున్నా చివరకు ఆ ఛాన్స్ కాజల్ ను వరించింది. ఈ సినిమాకు ముందు చందమామకు బ్రహ్మోత్సవం.. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఫ్లాప్స్ వచ్చాయి. అయినా.. మెగాస్టార్ తో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. 

 

ఖైదీ నెంబర్ 150 తర్వాత కాజల్ కు తెలుగులో స్టార్స్ సినిమాలు దక్కలేదు. ఎమ్మెల్యే కవచం.. రణరంగం లాంటి చిన్న సినిమాలు చేసినా అవి సక్సెస్ కాకపోవడంతో కాజల్ పనైపోయిందన్నారు. మరోసారి చిరంజీవి కాజల్ పాలిట ఆపద్భాంధవుడిలా కనిపించాడు. మందుగా త్రిషను సెలెక్ట్ చేయగా.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి హీరోయిన్ తప్పుకుంది. ఈ బంపర్ ఆఫర్ అనుకోకుండా.. కాజల్ ను వరించింది. 

 

కాజల్ ను ఆదుకుంటున్న మరో స్టార్ విజయ్. ఈ ఇద్దరి కాంబినేషన్ తుపాకీతో మొదలైంది. ఆ తర్వాత జిల్లా.. మెర్సల్ సినిమాలో జత కట్టారు. హ్యాట్రిక్ తో హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట మరోసారి జతకడుతోంది. మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో రూపొందే సినిమాలో హీరోయిన్ గా కాజల్ అనుకుంటున్నారు. 2004లో హిందీ మూవీతో వెండితెరకు పరిచయమైన కాజల్.. 16ఏళ్లుగా కెరీర్ సాగించడం అంత ఈజీ కాదు. కొత్త అందాలు ఎన్ని వచ్చినా.. విజయ్.. చిరంజీవి లాంటి స్టార్స్ ఆశీస్సులతో ప్రతీసారి కెరీర్ ను నిలబెట్టుకుంటోంది కాజల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: