బాలీవుడ్ నటి, పార్లమెంట్ సభ్యురాలు హేమా మాలిని వైద్యులు, కరోనాను కట్టడి చేయడం కోసం కృషి చేస్తున్న వారిపై దాడులు చేయడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హేమా మాలిని మాట్లాడుతూ " మిత్రులారా... కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న వారిపై దాడులు జరిగినట్లు మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. విధులు నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. వారిపై ఇలా దాడి చేయడం చాలా అసహ్యకరమైన చర్య. వాళ్లు జీవితాలను త్యాగం చేస్తూ కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారు. ఎవరైతే దాడులు చేశారో వారిని అస్సలు వదిలిపెట్టవద్దని" వీడియో పోస్ట్ చేశారు. 
 
సోషల్ మీడియాలో హేమా మాలిని పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత కొన్ని రోజుల నుండి హేమా మాలిని సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రజలందరూ కేంద్రం అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆమె కోరారు. 
 
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. స్వీయ నిర్భంధంలో ఉన్న హేమా మాలిని ఎప్పటికప్పుడు తన వీడియోల ద్వారా ప్రజలకు సందేశాలు ఇస్తున్నారు. దేశం కరోనా మహమ్మారి వల్ల క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోందని ఆమె పేర్కొన్నారు. ఏ మతానికి, జాతికి చెందిన వారైనా ఇంట్లోనే ఉండటం ముఖ్యమని సూచించారు. 

 


 
ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తే కరోనా అదుపులోకి వస్తుందని చెప్పారు. కరోనాపై లాక్ డౌన్ ద్వారా గెలిచి భారతమాతను గెలిపించుకుందామని పేర్కొన్నారు. దేశ పౌరులంతా కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలని... కరోనా బారి నుంచి దేశాన్ని రక్షించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: