ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) మూవీ పై కేవలం మన టాలీవుడ్ లోనే కాక పలు ఇతర భాషల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ని ఇటీవల లాక్ డౌన్ నేపథ్యంలో అర్ధాంతరంగా నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. 

 

వాస్తవానికి అంతకముందు ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగవలసి ఉంది, అంతలోనే ఈ మహమ్మారి కరోనా రావడంతో ఈ విధంగా షూటింగ్ ని ఆపేశామని నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ చెప్పారు. ముందుగా రిలీజ్ చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ తో పాటు ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ కు కూడా అందరి నుండి మంచి స్పందనను రాబట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రాజమౌళి. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ మేరకు 75 శాతానికి పైగా పూర్తి అయిందని అన్నారు. కాగా అది కేవలం షూటింగ్ పార్ట్ మాత్రమే పూర్తి అయిందని, ఇటువంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అవసరం ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే అని, ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మాత్రమే విజువల్స్ వర్క్ జరుగుతోందని, చాలా వరకు వర్క్ పెండింగ్ లోనే ఉన్నట్లు ఆయన చెప్పారు.

 

అయితే మరి ఈసారైనా అనుకున్న విధంగా 2021, జనవరి 8 న సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని న్యూస్ రీడర్ అడిగిన ప్రశ్నకు రాజమౌళి కొంత వివరణ ఇచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న ఈ కరోనా ఎఫెక్ట్ ఎంతవరకు మన దేశంలో ఉంటుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి అని, అలానే మే 3 తరువాత పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేస్తారా, లేక పొడిగిస్తారా అనేది ఇప్పుడే చెప్పలేమని, ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా కూడా వెంటనే సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ వస్తుందా లేదా అనేది చెప్పలేం అని, ఇక అన్నిటికంటే ముఖ్యంగా కొంతమంది ఆర్టిస్టుల కాల్షీట్స్ మళ్ళి కొంతమేర అడ్జస్ట్ చేయడంతో పాటు ఖాళీగా ఈ ఉన్న ఈ మధ్య సమయంలో మిస్ అయిన పార్ట్ ని వేగవంతంగా తీయడం కూడా కొంత కత్తి మీద సాము వంటి విషయం అని అన్నారు. సో మొత్తంగా దీనిని బట్టి తమ సినిమా పక్కాగా జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనేది చెప్పలేనని, ఏదైనా మరికొద్దిరోజులు గడిస్తేనే గాని చెప్పలేం అని అన్నారు రాజమౌళి. అయితే ఆయన మాటలను బట్టి చూస్తే ఆర్ఆర్ఆర్ ఒకరకంగా రాబోయే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ కావడం కొంత కష్టమే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో తెలియాలంటే మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: