ప్ర‌పంచ దేశాలను క‌రోనా తీవ్ర సంక్షోభంలో నెట్టేసింది. అగ్ర‌రాజ్యాలు సైతం ఈ మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్నాయి. మాన‌వ జాతికి స‌వాల్ విసురుతున్న ఈ మహమ్మారి వ‌ల్ల రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో దేశ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డంతో పాటు, కరోనా ప్రభావం వల్ల అతలాకుతలమైన‌ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు నానా అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఇక కరోనా మహమ్మారి పై పోరాటంలో భాగంగా తమ వంతు సాయం అందించడానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. 

 

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసారు. ప్ర‌ముఖ నిర్మాత మోహ‌న్ చెరుకూరి రూ. 5 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. షూటింగ్‌లు లేక ఉపాధి క‌రువై ఇబ్బందులు ప‌డుతున్న సినీ కార్మికులను సీసీసీ ఆదుకుంటున్న తీరు అభినంద‌నీయ‌మ‌నీ, అందులో త‌నూ భాగం కావాల‌నే ఉద్దేశంతో త‌న వంతుగా ఈ విరాళం అందిస్తున్నాన‌నీ ఆయ‌న చెప్పారు. క‌రోనా ఉధృతిని అరిక‌ట్ట‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌నీ, వైద్య సిబ్బంది, పోలీసులు అద్భుతంగా త‌మ విధుల‌ను అహ‌ర్నిశ‌లూ నిర్వ‌హిస్తున్నారని ఆయ‌న కొనియాడారు.

 

అలాగే ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌న ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచ‌డానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంత‌రం శ్ర‌మించ‌డం గొప్ప విష‌య‌మ‌ని మోహ‌న్ అన్నారు. ప్ర‌భుత్వ యంత్రాంగాలు చేస్తున్న ఈ కృషికి త‌గ్గ‌ట్లు పౌరులుగా మనంద‌రం మ‌న ఇళ్ల‌ల్లోనే క్షేమంగా ఉంటూ క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవ‌డంలో మ‌న వంతు పాత్ర పోషించాల‌ని ఆయ‌న కోరారు. చెరుకూరి మోహన్ సవ్యసాచి, గ్యాంగ్ లీడర్, రంగస్థలం, డియర్ కామ్రేడ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. చెరుకూరి మోహన్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా దూసుకుపోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: