త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. స్వయంవరం సినిమాతో మాటల రచయితగా సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే అనే ప్రేమ క‌థా చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈయన ద‌గ్గ‌ర ఉన్న స్పెషాలిటీ మాట‌ల‌తో మాయ చేయ‌డం. త‌న మాటలతో మాయ చేస్తూ.. భాషలో సొగసుల్ని చూపిస్తూ.. కథల్లో మనల్ని మనకు చూపిస్తూ ప్రేక్షకులకు స్వచ్ఛమైన ఆనందాన్ని పంచుతుంటారు. ముఖ్యంగా రెండున్నర గంటలలో మూడక్షరాల జీవితానికి సరిపడా పాఠాలను అందించే రచయిత త్రివిక్ర‌మ్‌.

 

ఏ సినిమాలో అయినా ఆయన డైలాగులు టపాసుల్లా పేలతాయి. ఆయన పంచ్‌లకు థియేటర్‌లో ప్రేక్ష‌కుల చేత‌ ఈలలు, చప్పట్లు వేయిస్తాయి. అందుకే ఆయ‌న టాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు అయ్యాడు. సామాన్య కుటుంబంలో జన్మించిన త్రివిక్రమ్ చదువు పూర్తయ్యాక ట్యూషన్‌ మాస్టరుగా కెరీర్‌ ప్రారంభించాడు. త్రివిక్రమ్‌ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. అయితే త్రివిక్ర‌మ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్ట‌కు ముందు రోజూ ఏదో ఒక టైమ్‌లో సినిమా చూస్తేనే గాని తెల్లారేది కాద‌ట‌. ఇక సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌ రైలెక్కారు. 

 

హైదరాబాద్‌ అమీర్‌పేటలోని చిన్న ఇంట్లో నటుడు సునీల్‌తో కలిసి ఉంటూ తన సినీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే చాలా రోజుల పాటు ఎలాంటి అవ‌కాశాలు లేక‌.. మ‌ళ్లీ ట్యూష‌న్ చెప్ప‌డం స్టాట్ చేశారు. అలా ట్యూషన్స్‌ చెబుతూనే సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ త‌ర్వాత‌ పోసాని మురళీకృష్ణ వద్ద కొంతకాలం శిష్యరికం చేశారు. అలా సినిమాల‌పై కొంత ప‌ట్టు సాధించిన ఈయ‌న స్వయంవరం సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ సినిమా ద్వారా త్రివిక్ర‌మ్‌కు మంచి పేరు రావ‌డంతో నువ్వేనువ్వే సినిమాతో డైరెక్ట‌ర్‌గా మారారు.

 

ఇక ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్ర‌మంలోనే  అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల చెంత చేరాడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. నువ్వే నువ్వే, అత‌డు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠ‌పుర‌ములో ఇలా ప్ర‌తి సినిమాతోనూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌ర్చుకున్నాడీయ‌న‌. ఇక త్రివిక్రమ్‌ సినిమా అంటే వినోదాలు గ్యారెంటీ అనే భరోసాని ప్రేక్షకుల్లో కనిపిస్తుంటుంది. ఇలా రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈయన దర్శకుడిగానూ సత్తా చాటి టాలీవుడ్ రియ‌ల్ హీరో అనిపించుకుని విజేత‌గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: