మెగా స్టార్ చిరంజీవి వార‌సుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన చిరు త‌న‌యుడు రామ్ చరణ్ కెరీర్ తొలినాళ్లలోనే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్లో మ‌గ‌ధీర‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుని ఏకంగా ఇండ‌స్ట్రీ హిట్‌నే ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆత‌రువాత ఆ స్థాయి విజ‌యం ద‌క్క‌క కాస్త జోరు త‌గ్గినా ధృవ‌, రంగ‌స్థ‌లం వంటి విజ‌యాల‌తో ఇప్పుడు స‌క్సెస్ బాట‌లో దూసుకుపోతున్నాడు. తాజాగా‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలోనూ యంగ్ టైగ‌ర్ తార‌క్‌తో క‌లిసి చెర్రీనటిస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' పాత్రలో కనిపిస్తుండగా చెర్రీ బ్రిటిష్ పాల‌కుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన విప్ల‌వ జ్యోతి అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో కనిపిస్తున్నాడు. సినిమాలో చెర్రీ న‌ట‌న‌కు సంబంధించి చాలా గూస్‌బంబ్స్ మూమెంట్స్ ఉంటాయ‌ట‌.

 

నిజానికి క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ప్ర‌ధాన చిత్రాల‌కే ప్రాధాన్య‌మిస్తూ వ‌చ్చిన రాంచ‌ర‌ణ్‌లో మంచి న‌టుడు ఉన్నాడ‌ని ప్రేక్ష‌కుల‌కు చాటిచెప్పిన చిత్రం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ 'రంగస్థలం. న‌ట‌నాప‌రంగా చరణ్ కు ఇది కెరీర్ లోనే ది బెస్ట్ అన‌డంలో ఎవ‌రికీ అనుమానాలు లేవు. క‌మ‌ర్షియ‌ల్ గానూ ఈ సినిమా అంతే స్థాయిలో విజ‌యాన్నిఅందించింది. అయితే ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రంలో చెర్రీ పెర్‌ఫార్మెన్స్ మ‌రింత అద్భుతంగా న‌ట‌నాప‌రంగా అత‌డిని మ‌రిన్ని మెట్టు ఎక్కించ‌బోయేదిగా ఉండ‌బోతోందిట‌. రాజ‌మౌళి చిత్రాలంటేనే హీరోయిజం ఓ రేంజులో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విష‌య‌మే. అంతేకాదు న‌ట‌నప‌రంగానూ ఆయ‌న సినిమాల్లో హీరోలు ఎంత ఎలివేట్ అవుతార‌నేది ఆయ‌న గ‌త చిత్రాలు చెప్ప‌క‌నే చెబుతాయి. 

 

ఇక ప‌దేళ్ల త‌రువాత ద‌ర్శ‌క‌ధీరుడి కాంబోలో చెర్రీ న‌టిస్తున్న ఈ చిత్రం చ‌ర‌ణ్ కెరీర్‌ను మ‌రో ప‌ది మెట్లు ఎక్కించ‌డం ఖాయ‌మ‌ని సినీవ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన వీడియోలో చరణ్ క‌నిపించిన స‌న్నివేశాలు అభిమానుల‌ను విజిల్స్ వేయించాయి.  స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడి పాత్ర కావ‌డం, అదీ జ‌క్క‌న్న మ‌లిచే చిత్రం కావ‌డం, వీట‌న్నింటికీ తోడు యంగ్ టైగ‌ర్‌తో చెర్రీ న‌టిస్తున్న మ‌ల్టీ స్టారర్ కావ‌డంతో ర‌ణం రౌద్రం రుధిరం చిత్రంపై ఇప్ప‌టికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి డీవీవీ దాన‌య్య నిర్మాత‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: