దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ హీరోలుగా ఆర్ఆర్ఆర్‌ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. చరిత్ర ప్రకారం అల్లూరి, భీం కలవకపోయినప్పటికీ వీరిద్దరూ స్వాతంత్రం కోసం కలిసి పోరాటం చేసే కథతో ఈ సినిమాను రాజమౌళి  తెరక్కిస్తున్నారని ప్రచారం జరిగింది. 
 
రాజమౌళి గతంలో ఊహాజనిత కథలో అల్లూరి, భీం పాత్రలను తీసుకుని సినిమా తెరకెక్కిస్తున్నానని చెప్పడంపై కొందరు చరిత్రకారులు విమర్శలు చేశారు. రాజమౌళి చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి వైరల్ అవుతున్న ఈ వార్త గురించి స్పందించి స్పష్టత ఇచ్చారు. 
 
చరిత్రను మార్చాలనే ఉద్దేశం తనకు లేదని... చరిత్రను వక్రీకరించాలని కూడా తాను అనుకోవడం లేదని... అల్లూరి, భీం కలిసి పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచనతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని చెప్పారు. నేను ఫిక్షన్ అని ముందుగానే చెబుతున్నానని... చరిత్రను తానేం మార్చడం లేదని అన్నారు. చరిత్రకారుల నుంచి సమస్య వస్తుందని తాను అనుకోవడం లేదని అన్నారు. 
 
ఆర్ఆర్ఆర్‌ సినిమాలో క్యారక్టర్లు అన్నీ కల్పిత పాత్రలే అని స్పష్టత ఇచ్చారు. దేశానికి ఏదో చెప్పాలని ఈ కథను ఎంచుకోలేదని... ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తాను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాని చెప్పారు. స్నేహం ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పారు. ఆర్ఆర్ఆర్‌ ను వర్కింగ్ టైటిల్ గా అనుకున్నామని ముందుగా టైటిల్ అనుకోలేదని చెప్పారు. వ్యక్తిగతంగా లాక్ డౌన్ వల్ల ఇబ్బంది లేదని చెప్పారు.                    

మరింత సమాచారం తెలుసుకోండి: