టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా అక్కడక్కడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ రంగప్రవేశం చేసిన నట విరాట్, నట ప్రపూర్ణ రావు గోపాలరావుకు 1975లో దర్శకదిగ్గజం బాపు తెరకెక్కించిన అద్భుత చిత్ర రాజం, ముత్యాల ముగ్గు ద్వారా మంచి పేరు లభించింది. ఆ సినిమాలో విలన్ గా రావు గోపాల రావు నటన నభూతో నభవిష్యతి అని చెప్పకతప్పదు. అప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఒక విధంగా సాగిన విలన్స్ పాత్రలను, మ్యాత్యాల ముగ్గు సినిమాలోని తన కాంట్రాక్టర్ పాత్ర ద్వారా సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టారు రావు గోపాలరావు. ఓ వైవు విలనిజం పండిస్తూ, మరోవైపు ఒకింత సరదాగా డైలాగులు చెప్పడం నిజంగా ఆయనకే చెల్లింది. 

 

ఇక అక్కడ నుండి వరుసగా అవకాశాలు అందుకుని పలు సినిమాల్లోని పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రావు గోపాల రావు, వారి గుండెల్లో మంచి స్థానాన్నిసంపాదించుకున్నారు. ఇక ఆయన తనయుడైన రావు రమేష్, ముందుగా అక్కడక్కడ కొన్ని టివి సీరియల్స్ లో నటించడం జరిగింది. ముందుగా 2002లో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సీమ సింహం సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన రావు రమేష్ కు, ఆపై కొన్నాళ్ళు పెద్దగా అవకాశం రాలేదు. అనంతరం కొంత గ్యాప్ తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో ఆయన, జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఒక నక్సలైట్ పాత్రలో నటించారు. కాగా ఆ సినిమాలో ఆయన కనిపించేది కొద్దిసేపే అయినా, ఆ పాత్రకు ఎంతో మంచి పేరు లభించింది. ఇక ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాల తీసిన కొత్త బంగారు లోకం సినిమాలో లెక్చరర్ గా నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రావు రమేష్, మెల్లగా అవకాశాలు అందుకోవడం మొదలెట్టారు. 

 

ఇక వరుసగా అవకాశాలు వస్తుండడంతో పాటు సినిమా సినిమాకు తన నటనలో పరిణితి పెంచుకుంటూ, అత్యద్భుతంగా నటిస్తూ నేడు టాలీవుడ్ మాత్రమే కాదు, తన తండ్రి కీర్తి శేషులు రావు గోపాల రావు గర్వించదగ్గ తనయుడిగా గొప్ప పేరు దక్కించుకుని, నిజంగా పులి కడుపున పులే పుడుతుంది అనే నానుడిని నిజం చేసారు రమేష్. విలక్షణ నటుడిగా ప్రస్తుతం మంచి పేరు ప్రఖ్యాతలతో దూసుకెళ్తున్న రావు రమేష్, నేడు తన 52వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. కాగా ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు. ....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: