క‌రోనా వైర‌స్ కార‌ణంగా అనేక రంగాలు కోలుకోలేని దెబ్బ‌తింటున్నాయి. ఇక సినిమా ప‌రిశ్ర‌మపై ఈ ప్ర‌భావం మ‌రింత తీవ్రంగా ఉండే ప్ర‌మాదం ఉంది. ఇప్ప‌టికే ముక్కుతూమూలుగుతూ ముందుకు వెళ్తున్న ఇండ‌స్ట్రీ క‌రోనా ఎఫెక్ట్‌తో భీతిల్లిపోతోంది. ఇప్పటికే పైరసీ, ఓటీటీ, శాటిలైట్‌ దెబ్బలతో అబ్బా అంటున్న‌ సినిమా పరిశ్రమ కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యమే ప‌డుతుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. లాక్‌డౌన్ త‌ర్వాత మిగ‌తా రంగాలు త్వ‌ర‌గా కోలుకునే అవ‌కాశం ఉంటుందేమోగానీ.. సినిమారంగం మాత్రం అంత‌సులువుగా ఈ సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని, సుమారు ఐదారు నెల‌లు ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఒక‌వేళ లాక్‌డౌన్ ఎత్తేసినా.. జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. క‌రోనా భ‌యంతో ఇంటి నుంచి బ‌య‌ట‌కు అడుగుపెట్ట‌డానికి వ‌ణికిపోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఇక థియేట‌ర్లకు ఎలా వ‌స్తార‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా.. లాక్‌డౌన్ కార‌ణంగా అనేక రంగాల్లో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. నిరుద్యోగ స‌మ‌స్య తీవ్ర‌మవుతోంది.

 

ఇక పూట‌గ‌డ‌వ‌డ‌మే క‌ష్ట‌మైపోతున్న కాలంలో జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూస్తార‌ని అనుకోవ‌డం అత్యాశే అవుతుంది మ‌రి. కుటుంబంతో క‌లిసి మ‌ల్టీప్లెక్స్‌కు వెళ్తే.. సుమారు మూడు వేల రూపాయ‌ల ఖ‌ర్చు అవుతోంది. అంతేగాకుండా.. క‌రోనాకు ఇంత‌వ‌ర‌కూ మందు లేదు. వ్యాక్సిన్ రావ‌డానికి సుమారు 12 నుంచి 18 నెల‌ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వైద్య‌నిపుణులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో స్వీయ‌నియంత్ర‌ణ‌తో భౌతిక‌దూరం పాటించ‌డం ఒక్క‌టే మ‌న‌ముందున్న ఏకైక మార్గం. ఇక థియేట‌ర్ల‌లో భౌతిక‌దూరం అసాధ్యం. దీంతో క‌రోనాకు వ్యాక్సిన్ వ‌చ్చి.. ప్ర‌జ‌ల్లో భ‌యం పోయిన‌ప్పుడే థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని, అప్ప‌టివ‌ర‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాత కూడా మ‌రో రెండు మూడు నెల‌ల‌పాటుథియేట‌ర్లను మూసి వేయ‌డమే మంచిద‌ని ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇక మ‌ల్టీప్లెక్స్‌లను ఏకంగా ఆరు నెల‌ల‌పాటు మూసి ఉంచ‌డం బెట‌ర్ అని మ‌రికొంద‌రు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: