లాక్డౌన్ వేళ టాలీవుడ్లో ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రారంభమైన ఈ ఛాలెంజ్‌ను ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు పాటిస్తున్నారు. ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయడమే ఈ ఛాలెంజ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇంట్లో పనులు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మరికొంతమందికి సవాల్‌ను విసురుతున్నారు. సందీప్ రెడ్డి వంగా మొదట ఈ ఛాలెంజ్ ను దర్శకుడు రాజమౌళి కి విసరగా.. రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించి తన ఇంటిని శుభ్రం చేసి ఆ ఛాలెంజ్ ను కాస్తా ఎన్టీఆర్ - రామ్ చరణ్‌లకు, కీరవాణి, సుకుమార్, శోభు యార్లగడ్డలకు విసిరిన విషయం తెలిసిందే.
రాజమౌళి సవాలును స్వీకరించిన ఎన్టీఆర్ తన ఇంట్లో అంట్లు శుభ్రం చేస్తూ.. ఇల్లు తుడుస్తూ.. ఇంటి ముందున్న చెత్తను ఊడ్చేశాడు. అంతేకాదు బాబాయి బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున బాబాయ్, వెంకటేశ్, కొరటాల శివలకు ఈ సవాలు విసిరారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ స్వీకరించారు కూడా. మరోవైపు రామ్ చరణ్ బట్టలు సర్దుతూ.. మాప్‌తో ఫ్లోర్ క్లీన్ చేస్తూ.. మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు భార్య ఉపాసనకు కాఫీ పెట్టిచ్చారు. ఇంటి పనులు చేయడానికి గర్వపడదాం.. పని భారాన్ని పంచుకోవడం ద్వారా మహిళలకు సహాయం చేసి రియల్ మ్యాన్ అనిపించుకుందాం.. #BetheREALMAN అంటూ పోస్ట్ చేసాడు చరణ్. అంతేకాకుండా దర్శకుడు త్రివిక్రమ్, బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, రానా దగ్గుబాటి, శర్వానంద్ లను ఈ ‘బీ ద రియల్ మెన్’ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు.
ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి ఇచ్చిన సవాల్‌ను స్వీకరించారు లెక్కలమాస్టార్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్. దానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో సుకుమార్ ఇంటి పనికి చివర్లో ఆయన సతీమణి తబిత బావుందంటూ మార్కులేయడం విశేషం. ఇక తన ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, కొరటాల శివ, నిర్మాత దిల్ రాజు పేర్లను నామినేట్ చేశారు సుకుమార్. మరి ఈ ఛాలెంజ్ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.