లాక్ డౌన్ కొనసాగుతున్నా రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న పరిస్థితులలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ లాక్ డౌన్ మే నెల చివరివరకు కొనసాగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ప్రతిరోజు కొన్నివేల కోట్ల ఆదాయం కోల్పోవడంతో ప్రభుత్వాలు కూడ సగటు మనిషిలా ఫస్ట్ తారీఖు సమీపిస్తుంటే భయపడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సామాన్య కుటుంబంలోని ఇల్లాలుకి ఇంటి చాకిరీతో పాటు ఆమె పై భర్తల టార్చర్ రోజురోజుకు పెరిగిపోతున్న విషయాన్ని వివరిస్తూ ‘ఇల్లాలికి ఇక్కెట్లు’ అంటూ ఈరోజు ఒక ప్రముఖ దినత్రిక తన సర్వే వివరాలను ప్రచురించింది.


ప్రస్తుతం చాలామంది భర్తలు తమ అసహనాన్ని అంతా భార్యల పైనే ప్రదర్శిస్తున్నారని గతంలోకన్నా భార్యాభర్తల మధ్య గొడవలు విపరీతంగా పెరిగిపోయాయని ఆ కథనం పేర్కొంది. అంతేకాదు తమ భర్తలు తమ పై పెడుతున్న టార్చర్ భరించలేక ప్రస్తుతం సగటున ప్రతిరోజు ఈ కరోనా టైమ్ లో కూడ 27 ఫిర్యాదులు షీ టీమ్స్ కు వస్తున్నాయి అంటూ ఆ శాఖకు సంబంధించిన ఒక అధికారి చెప్పారు అంటూ కథనంలో ఆ పత్రిక పేర్కొంది. 


దీనితో ఒకవైపు కరోనా సమస్యతో ట్రాఫిక్ ను అదుపులో పెడుతూ పాజిటివ్ కేసులను అన్వేషించడంలో సహాయపడుతున్న పోలీసు శాఖకు ఇల్లాలి ఇక్కట్లు కూడ ఒక అదనపు సమస్యగా మారిందని ఆ కథనంలో ఆసక్తికర వివరాలు వివరించింది. గతంలో కన్నా గృహిణుల పై పని భారం రెట్టింపు కావడమే కాకుండా భర్తల చేతిలో మానసిక శారీరక లైంగిక హింస కూడ పెరిగిపోయింది అంటూ ఆమెకు ప్రస్తుత భరోసా కావాలి అంటూ ఆ కథనం అభిప్రాయపడింది.


ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఇల్లాలికి ఏర్పడటానికి గల కారణం ఉద్యోగ భద్రత ఆర్ధిక భద్రత పై రోజురోజుకు మగవారిలో పెరిగిపోతున్న ఆందోళనా దీనికితోడు మద్యం ధూమపానం వంటి అలవాట్లు ఉన్న వారికి ఇప్పుడు అవి చాలామందికి అందుబాటులో లేకపోవడంతో మగవాళ్ళల్లో అసహనం కోపం పెరిగి వారి భార్యల పై గృహ హింస పెరిగిపోయిందని ఆ కథనం పేర్కొంది. కరోనా తో ప్రేమలు ఆప్యాయతలు పెరిగిపోయాయి అనుకుంటే పొరపాటేనని నాలుగు గోడల మధ్య ఇల్లాలు అనుభవిస్తున్న మౌన వేదన ఈ కరోనా సమయంలో చాలామంది ఇళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తోంది అంటూ అభిప్రాయపడ్డ ఆకథనం చదివిన వారికి కరోనా ఆర్ధిక వ్యవస్థనే కాదు కుటుంబ వ్యవస్థను కూడ ఎలా నాశనం చేస్తోందో బాధాకరంగా మారింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: