తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ ది ప్ర‌త్యేక శైలి. హీరోల పాత్రల‌ను  డిఫరెంట్ గా ప్ర‌జెంట్ చేస్తూ వారిని అప్ప‌టివ‌ర‌కు చూడ‌ని మేన‌రిజ‌మ్‌తో చూపించి ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌డంలో ‌పూరీ ది అందెవేసిన చేయి అని చెప్పాలి. అప్ప‌టిదాకా చిన్న‌చిన్న పాత్ర‌లు వేస్తున్న ర‌వితేజ‌ను ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యంతో హీరోగా మార్చి, ఆ త‌రువాత ఇడియ‌ట్, అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి వంటి చిత్రాల‌తో మాస్ మ‌హారాజ్ గా మ‌లిచిన ఘ‌న‌త ఈ ద‌ర్శ‌కుడిది. ఇక మ‌హేష్‌తో పోకిరి తీసి ఏకంగా ఇండ‌స్ట్రీ హిట్‌నే త‌న ఖాతాలో వేసుకున్నాడు.  కెరీర్‌లో  ఎన్ని ఒడిదుడుకులైనా నిల‌బ‌డిన ద‌మ్మున్న‌ డైరెక్టర్ గా పేరున్న‌ పూరీ జగన్నాథ్ ఇటీవ‌లే త‌న సినీ ప్ర‌స్థానంలో  రెండు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకున్నాడు.

 

ఇప్ప‌టిదాకా టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలంద‌రితోనూ ప‌ని చేసి వారికి సూప‌ర్‌హిట్ చిత్రాల నందించిన పూరీ గ‌త ఏడాది సీనియ‌ర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌తోనూ పైసా వ‌సూల్ చిత్రం తీసి బాల‌య్య అభిమానుల‌ను అల‌రించాడు.  అయితే మెగాస్టార్ చిరంజీవిని మాత్రం ఇప్ప‌టిదాకా పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేయ‌లేదు. ఆ వెలితి మాత్రం ఇంకా అలాగే మిగిలిపోయింద‌న్న‌ది  పూరీ మ‌న‌సులోని మాట‌. ఈ విష‌యాన్ని ప‌లుసార్లు ఈ ద‌ర్శ‌కుడు స్వ‌యంగా ప్ర‌స్తావించాడు కూడా..‌! నిజానికి ఈ కాంబో సాకారం చేసేందుకు గ‌తంలో గ‌ట్టి ప్ర‌య‌త్నాలే జ‌రిగాయికాని కొన్ని కార‌ణాల వ‌ల‌న అవి వ‌ర్క‌వుట్ కాలేదు. గ‌తంలో చిరు రీ ఎంట్రీ మూవీకి పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట‌ర‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. దీనికి 'ఆటోజానీ' అనే టైటిల్ కూడా నిర్ణ‌యించినట్టు వార్త‌లు వ‌చ్చాయి. 

 

అయితే చివ‌రిలో ఆ సినిమా క‌థ చిరంజీవికి  అంతగా న‌చ్చ‌లేద‌నే కార‌ణంగా ఆ సినిమా ఆగిపోయింది . అంతేకాదు దానికి ముందు మ‌రో మూడు క‌థ‌లు కూడా చిరుకు వినిపించినా ఈ కాంబో పూరీకి వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ వీరి కాంబినేషన్ లో సినిమా గురించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతుండ‌టం విశేషం. ఎలాగైనా చిరును మెప్పించే క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచే చిత్రాన్ని నిర్మించాల‌ని పూరీ గ‌ట్టి ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు స‌మాచారం.  ఇందుకోసం రెండు స్టోరీలు రెడీ చేస్తున్నాడట‌. 'ఇస్మార్ట్ శంకర్' విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పూరీ కి చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే ఇది క్రేజీ కాంబో కావ‌డం తథ్య‌మేన‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: