రీ ఎంట్రీ తరువాత చిరంజీవి ఇప్పుడిప్పుడే స్పీడు పెంచుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలతో నటిస్తున్న మెగాస్టార్ తరువాత సుజిత్ దర్శకత్వంలో మలయాళ సూపర్‌ హిట్ లూసిఫర్‌ ను రీమేక్‌ చేయనున్నాడు. అంతేకాదు ఆ సినిమా తరువాత బాబీ, పరుశురామ్, హరీశ్‌ శంకర్‌, మెహర్‌ రమేష్ లాంటి దర్శకులతో సినిమాలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని చిరు స్వయంగా వెల్లడించాడు. దీంతో చిరు జోరు చూసి యంగ్ హీరోలు కూడా వావ్‌ అంటున్నారు.

 

అయితే ఈ నేపథ్యంలో అభిమానులు ఓ క్రేజీ కాంబినేషన్ తెర మీదకు వస్తే ఎలా ఉంటుందని భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా చేస్తే ఎలా ఉంటుంది.? గతంలో వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభమైంది. కొంత షూటింగ్ కూడా జరిగిన తరువాత వర్మ బాలీవుడ్ సినిమా కోసం ఈ ప్రాజెక్ట్‌ ను పక్కన పెట్టేసి ముంబై వెళ్లిపోయాడు. దీంతో అలిగిన మెగాస్టార్‌ ఇక వర్మతో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. తరువాత వర్మ రేంజ్‌ కూడా భారీగా పెరిగిపోవటంతో ముంబై కే పరిమితమైపోయాడు.

 

కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్‌తో రామ్‌గోపాల్ వర్మ తన ఫాం కోల్పోయాడు. తన స్థాయికి తగ్గ సినిమాలు తీయటంలో వరుసగా ఫెయిల్ అవుతున్న వర్మ, థియేటర్ల లో కన్న సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే వర్మ మనసు పెట్టి సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్‌. మరి ఈ సమయంలో వర్మ, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఆ సినిమా కథా కథనాలు ఎలా ఉండాలి అని లెక్కలు వేస్తున్నారు మెగాస్టార్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: