లాక్ డౌన్ వచ్చే మే నెలలో కూడ కొనసాగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మరో రెండు నెలల వరకు ధియేటర్లు తెరుచుకునే పరిస్థితులు లేవు. దీనితో ఇప్పటికే రిలీజ్ కు రెడీ అయిన సినిమాల పరిస్థితి ఏమిటో తెలియక సినిమాలను నమ్ముకుని కోట్ల రూపాయలలో అప్పులు తీసుకువచ్చిన నిర్మాతలు ఈ లాక్ డౌన్ సమయంలో తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు.


ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో జనం అంతా ఒటిటి ప్లాట్ ఫామ్స్ లో వచ్చే సినిమాలకు అతుక్కు పోవడంతో భవిష్యత్ లో సినిమాలు రిలీజ్ అయినా వాటిని ధియేటర్లలో చూడటానికి జనం వస్తారా అన్న అనుమానాలు పెరిగిపోతు ఉండటంతో గతంలో కమలహాసన్ ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన ‘పే ఫర్ వ్యూ’ ఆలోచన పై దక్షిణాది సినిమా రంగంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గతంలో కమలహాసన్ నిర్మించిన ‘విశ్వరూపం’ సినిమాను ఆసినిమా విడుదలకు ఒక్కరోజు ముందు ‘పే ఫర్ వ్యూ’ విధానంలో బుల్లితెర పై ప్రదర్శించే విధంగా కమల్ అప్పట్లో ప్రయత్నాలు చేసాడు. 


టాప్ హీరోల సినిమాలను మొదటిరోజు మొదటి షో చూడాలి అన్న ఆతృత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి మూవీలను ఈ విధానంలో ఒకరోజు ముందు బుల్లితెర పై ప్రసారం చేస్తూ ఆ మూవీ ముందుగానే చూడాలని భావించే వారి కోసం డిజైన్ చేయబడింది ఈ ప్లాన్. ఈ ప్లాన్ లో సినిమాలు చూడాలి అని భావించే వారి దగ్గర నుండి 500 రూపాయలు వసూలు చేసి కేవలం ఒక్కసారి మాత్రమే చూసే అవకాశం కల్పిస్తూ అలా ప్రసారం అయ్యే సినిమాను పైరసీ చేయకుండా చేయకుండా జాగ్రత్తలు తీసుకునే ఒక పద్దతిని అప్పట్లో కమల్ ప్రతిపాదిస్తే దక్షిణాది సినిమా రంగం అంతా కమల్ ఆలోచనలను తప్పు పడుతూ విరుచుకు పడిపోయారు.  


అయితే ఇప్పుడు సినిమాలు ఇప్పట్లో ధియేటర్లలో విడుదలయ్యే పరిస్థితులు లేకపోవడంతో కమల్ గతంలో చేసిన ఆ ఆలోచనకు కొద్దిగా మార్పులు చేసి ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న చాల సినిమాలను ‘పే ఫర్ వ్యూ’ విధానంలో ముందుగా సినిమాలను బుల్లితెర పై ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు వచ్చి ఆ తరువాత ఒటీటీ ప్లాట్ ఫామ్స్ పై విడుదల చేసే అవకాశం పరిశీలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు ఉన్నట్లు టాక్. అయితే చాలామంది నిర్మాతలు మటుకు ఈ ఆలోచనలు ఏమాత్రం వాస్తవిక దృష్టిలో లేవని ధియేటర్లు ఓపెన్ అయ్యేవరకు వేచి చూడటమే మార్గం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు టాక్..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: