మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఆచార్య'... మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి కాగా కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే కొరటాల శివ ఈ చిత్ర కథను చిరంజీవికి చెప్పినప్పుడే చిత్రంలోని మరో కీలక పాత్ర గురించి స్పెషల్ గా చెప్పాడట. చరణ్ ప్రాధాన్యం ఉన్న ఆ కీలక రోల్ చేస్తున్నారని వార్తలు రావడంతో సినిమాకు మరింత హైప్ వచ్చి చేరింది. చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల కూడా పలు ఇంటర్వ్యూలలో చరణ్ 'ఆచార్య'లో నటించే విషయం పై స్పష్టత ఇచ్చారు. దీంతో ఒకే స్క్రీన్ పై మెగా తండ్రీ కొడుకులను చూడొచ్చని మెగా ఫ్యాన్స్ ఆశించారు. అయితే ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే తండ్రీ కొడుకుల కాంబో సెట్ అవడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. 

 

కరోనా లాక్ డౌన్ కి ముందు రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' డేట్స్ అడ్జస్ట్ చేసి 'ఆచార్య'కు కేటాయించాలని భావించారట. ఇక 'ఆర్ ఆర్ ఆర్' కూడా 2021 జనవరికి వాయిదా పడడంతో రాజమౌళి 'ఆచార్య'లో నటించేందుకు చరణ్ కు వెసులుబాటు కల్పించారట. అయితే లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే నెల రోజులకు పైగా షూటింగ్ ఆగిపోయింది. అంతేకాకుండా ఇప్పుడప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడి షూటింగ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనితో చరణ్ 'ఆచార్య'కు డేట్స్ ఇచ్చే అవకాశం లేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కనుక 'ఆచార్య' లో చరణ్ నటించడం కష్టమే అంటున్నారు. కొరటాల సైతం మరో హీరో కోసం ఇప్పటికే ఆలోచించడం మొదలుపెట్టాడట. చరణ్ కి కుదరకపోతే సూపర్ స్టార్ మహేష్ ఈ క్యారెక్టర్ లో కనిపించే అవకాశం ఉంది.

 

మహేష్ ఈ పాత్రలో నటించడానికి స్టోరీ కూడా వినకుండా 'నేనున్నాను కదా... దైర్యంగా ఉండండి' అంటూ భరోసా ఇచ్చాడని కొరటాల ఇప్పటికే స్పష్టం చేసాడు. సో చరణ్ లేకపోతే మహేష్ తో ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువున్నాయని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ - రామ్ చరణ్ కొణెదల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: