సమంత... టాలీవుడ్, కోలీవుడ్ భాషలలో తిరుగులేని నటి. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ చెన్నై బ్యూటీ కెరీర్ మొదలుపెట్టి పదేళ్లైనా ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉంది. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతటి గొప్ప హీరోయిన్ కైనా పెళ్లైన తరువాత అవకాశాలు తగ్గుతాయి. కానీ సమంతకు మాత్రం పెళ్లి తరువాత కూడా అవకాశాలు తగ్గడం లేదు సరికదా పెరుగుతున్నాయి.

 

స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ఎవరి సపోర్ట్ లేకుండానే ఈ స్టేటస్ అందుకుంది. ఎలాంటి సీనీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి స్వయంకృషి, టాలెంట్ తో వరుస అవకాశాలను దక్కించుకుంది. అటు గ్లామర్ పాత్రల్లోను, ఇటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోను నటిస్తూ అభిమానులను మెప్పిస్తోంది. ఎంత ఎదిగినా సమంతలో ఆ గర్వం ఎప్పుడూ కనిపించదు. సినిమాల్లోను, నిజ జీవితంలోను సమంతను చూస్తే మన పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది.

 

అందరితోను సరదాగా కలిసిపోయే వ్యక్తిత్వం సమంతకు సొంతం. 1987 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన సమంత చెన్నైలో జన్మించింది. 2010లో ఏ మాయ చేశావే సినిమాతో సమంత టాలీవుడ్ కు పరిచయమైంది. జెస్సీ పాత్రతో యువత హృదయాలు కొల్లగొట్టిన సమంత స్టార్ హీరోలతో వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నానిలతో ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో సమంత నటించింది.

 

ఈగ సినిమాలో సమంత తన పాత్రకు జీవం పోసింది. ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే సమంత 2013లో తెలుగు, తమిళంలో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకుంది. 2017లో అక్కినేని నాగచైతన్యతో సమంత వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఈ సంవత్సరం జాను సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సమంత ప్రస్తుతం ఒక కొరియన్ రీమేక్ కు, కన్నడ దియా రీమేక్ కు, వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అక్కినేని సమంత మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని... మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ ఏపీ హెరాల్డ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: