తీవ్ర‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ (53) మృతి చెందారు. పెద్ద‌పేగు సంబంధిత వ్యాధితో ఆయ‌న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చికిత్స కోసం చేరిన విషయం తెలిసిందే. ఈ విషయం ఆసుపత్రి అధికారికంగా ప్రకటన చేసింది. నాలుగు రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) మృతి చెందిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆమె అంత్యక్రియలు జరగగా ఇర్ఫాన్ ఖాన్ వెళ్లలేకపోయారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లి అంత్యక్రియలను చూశారు. ఈ ఘటన ఆయనను మరింత బాధ పెట్టేలా చేసింది. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారని ఆయన మిత్రులు మీడియాకు తెలిపారు. కొన్నేళ్లుగా ఆయన కేన్సర్‌ వ్యాధితో పోరాటం చేశారు. కొన్ని నెలల క్రితం కోలుకున్నారు.

 

మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. పలు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తనదైన శైలిలో మెప్పించిన ఆయన మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.  కాగా, జనవరి 7, 1967న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. అతని నటనలో ఉన్న సహజత్వం, పోషించిన వైవిధ్య భరితమైన పాత్రల ఆధారంగా అతన్ని భారతీయ అత్యుత్తమ నటుల్లో ఒకరిగా సినీ విశ్లేషకులు అభివర్ణిస్తారు.  

 

చిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. తాజాగా ముంబై వర్సోవా శ్మశానవాటికలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన భౌతికకాయన్ని పూడ్చిపెట్టారు. ఈ అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరయ్యారు. సామాజిక దూరం పాటిస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: