అతని శరీరం అందరిలా రక్త మాంసాలతో తయారైంది కాదేమో అనిపిస్తుంది. డ్యాన్స్ లో ఒళ్ళు విరుస్తూంటే అక్కడ ఉన్నదేంటి అన్న డౌట్ వస్తుంది. మెరుపు తీగలా ఎక్కడికక్కడ వంగిపోతూ తనను తాను చుట్టేసుకుంటూ చేసే విన్యాసాలు తొంబై దశకంలో ఆయన్ని ఒక్కసారిగా  హీరో చేసి పారేశాయి. 

 

టాలీవుడ్లో అప్పటికి స్టార్లు, సూపర్ స్టార్లు ఉన్నారు. అయినా సరే ఆ బక్కపలచని కుర్రాడు టాప్ చైర్లోకి దూసుకువచ్చేశాడు. ప్రభుదేవా.. ఈ పేరు తొంబై దశకంలో బాగా యూత్ లో వినిపించి కేక పెట్టించింది. ప్రభుదేవా తన తండ్రి సుందరం మాస్టార్ పక్కన అసిస్టెంట్ గా ఉంటూ వచ్చాడు. అతను ఎంతో మంది టాప్ హీరోలకు సాంగ్స్ కంపోజ్ చేశాడు. వారిని డ్యాన్సింగ్ డాల్స్ గా తెర మీద చూపించాడు. 

 

అటువంటి ప్రభుదేవా ఓవర్ నైట్  హీరో అయిపోయాడు. ఘరానా మొగుడుతో సొగసుగత్తెగా పేరు తెచ్చుకున్న‌ నగ్మా హీరోయిన్. ఇదేదో చిత్రమైన కాంబో అనుకున్నారు. ఇక అప్పటికే ఇళయరాజాను సైడ్ చేసి దూసుకువచ్చిన ఏ ఆర్ రహ్మాన్ మ్యూజిక్ మ్యాజిక్ కి యువత నాగుపాముల్లా మారి సమ్మోహనమైపోయింది. ఈ ముగ్గురూ కలసి డైరెక్టర్ శంకర్ తో కలసి చేసిన అద్భుతమే ప్రేమికుడు మూవీ.

 

మూవీ అటు కోలీవుడ్ లో వందల రోజులు ఆడేసింది, ఇక తెలుగు నాట కూడా విజయదుందుభి మోగించింది. ఎక్కడ చూసినా ప్రేమికుడు పాటలు ప్రభుదేవా డ్యాన్సులే. 1994లో విడుదల అయిన ప్రేమికుడు స్రుష్టించిన  రికార్డులు అన్నీ ఇన్నీ కావు. టేకిట్ ఈజీ అంటూ పాడుతూ వచ్చిన ప్రభుదేవా ఆ తరువాత సూపర్ స్టార్ అయిపోయాడు. ఎన్నో సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. ఆయన డైరెక్ష‌న్లో  హీరోలు డ్యాన్స్ చేసి తామే డ్యాన్స్ కింగులమని చెప్పుకున్న రోజులు పోయాయి.

 

తెర వెనక నుంచి ఇండియన్ డ్యాన్సింగ్ మైకెల్ జాన్సన్ తెర ముందుకు రావడంతో చాలా మంది టాప్ హీరోలు చాలా చాలా  ఇబ్బంది పడ్డారు. వరసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో ముఖానికి రంగు వేసుకోవడం కూడా కొన్నాళ్ళు  మరచిపోయారు. ఒక్క హిట్ కోసం వాచిపోయారు. అలా ప్రభుదేవా అనుకోని కలకలం స్రుష్టించి చాలా మంది జాతకాలు మార్చేశాడు. బిగ్ స్టార్స్ భయపడిపోయేలా చేశాడు. మొత్తానికి అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమికుడు అంటే ప్రభుదేవానే, డ్యాన్సింగ్ డాల్ అంటే కూడా ఆయనే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: