ఈరోజు అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ 3 ప్రముఖ వెబ్సైట్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత కొంతకాలంగా చాలామంది సినీ ప్రముఖులపై ఈ మూడు వెబ్ సైట్స్ తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆయన అన్నారు. 21 నిమిషాల పాటు విజయ్ దేవరకొండ ఈ విషయం గురించి మాట్లాడారు. సమాజం విపత్కర సమయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మూడు రకాలైన ప్రజలు బయట పడతారని... వారిలో మొదటగా అవస్థలు పడే వారు ఉంటారని... వారిని ఆదుకోవడానికి రెండో రకం ప్రజలు ఉంటారని... ఇదే అదునుగా భావించి పక్కవాళ్ళని తొక్కి ఎక్కువ డబ్బులు రాబట్టడానికి కాసుకు కూర్చునే మూడో రకం ప్రజలు ఉంటారని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ మూడో రకం ప్రజల్లో దిక్కుమాలిన గాసిప్స్ వ్రాసే వారి గురించి తాను మాట్లాడాడు.


మూడు వార్త వెబ్ సైట్లు తనని ఎంతో కాలం నుండి టార్గెట్ చేస్తున్నాయని... తన గురించి ఎన్నో తప్పుడు వార్తలు రాస్తున్నాయని... కానీ ఇంత కాలం ఆ వార్తలు రాసిన వారందరినీ క్షమించానని... ఇకపై వీరిని క్షమించే ఆస్కారమే లేదని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలో పని చేసే ఎంతో మంది డైరెక్టర్లు, యాక్టర్లు, నిర్మాతలు కూడా ఈ ఆన్లైన్ వార్తా వెబ్సైట్లు బాధితులు అయ్యారని... ఆ వెబ్ సైట్లను చదివే పాఠకులు కూడా బాధితులు అవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మన గురించే తప్పుడు వార్తలు రాసి... ఆ తప్పుడు వార్తలను మనకే అమ్మి... వాళ్ల తప్పుడు అభిప్రాయాలు మన మీద రుద్ది... వాళ్లు డబ్బులు దండుకుంటున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


తాను ఇంకా మాట్లాడుతూ... 'ఇటువంటి వారి గురించి నేను ఎప్పుడో మాట్లాడాలని అనుకున్నాను కానీ బురద మీద రాయి వేస్తే అది మన మీద పడుతుందని ఊరుకున్నాను. నిజాయితీగా పనిచేసే వార్తాపత్రికలు, పాత్రికేయులు నాకు చాలా మంది తెలుసు. వారిని నేను ఏమి అనడం లేదు. కొంతమంది గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. కానీ మూడు నాలుగు వెబ్సైట్లు మాత్రం డబ్బులు సంపాదించడానికి ఏదైనా చేసేస్తాయి. సినిమా రేటింగ్ లు కూడా ఈ నాలుగు వెబ్ సైట్లు నడిపే వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేసి ఇస్తారు. ఈ వెబ్సైట్స్ రాసే ఆర్టికల్స్ చదివిన వారికెవరికైనా వెంటనే అర్ధమవుతుంది వీళ్లేంత ఫేక్ గాల్లో అని. వీళ్లంతా గత నెల రోజులనుండి నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. విజయ్ దేవరకొండ ఎక్కడా? విజయ్ దేవరకొండ దాక్కున్నాడా? విజయ్ దేవరకొండ వేదిక మీదకు రావాలి... స్టేట్మెంట్లు ఇచ్చే విజయ్ దేవరకొండ సహాయం అందించరు. అని రకరకాలుగా నాపై ఆర్టికల్స్ రాస్తున్నారు' అని ఆయన అన్నారు.


అలాగే ఈ ప్రశ్నలు అడిగిన వారందరికీ దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు విజయ్ దేవరకొండ. తన మాట్లాడుతూ... 'అసలు మీరు ఎవరు నన్ను డొనేషన్స్ అడగడానికి? మీరు బతికేదే మా ఇండస్ట్రీ మీద. మీ వెబ్సైట్లకు మా సినిమాల అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. యాడ్స్ ఇవ్వకపోతే సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చి... రివ్యూ బ్యాడ్ గా రాస్తామని బెదిరింపులు. మీరు ఇంటర్వ్యూ అడిగితే మేము ఇవ్వాలి. ఇవ్వను అంటే మీకు తోచిన తప్పుడు అభిప్రాయాలను అందరి మీద రుద్దుతారు. చిల్లర కబుర్లు రాసి మళ్ళీ మీరే డబ్బులు సంపాదిస్తారు. నాకు నచ్చినప్పుడు. నేను అనుకున్నప్పుడు నాకు కుదిరినప్పుడు నేను ఎలా ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో... నాకు కనెక్ట్ అయిన వారికి ఇస్తా. అది నా ఇష్టం. కష్టపడి సంపాదించిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అనేది నా వ్యక్తిగతం. అది కూడా తెలుసుకోలేని ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా" అని విజయ్ దేవరకొండ వారికి సమాధానమిస్తూ తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పేదవారికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు సహాయం చేస్తున్నాని తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: