లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యి సినిమాలు రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు. థియేటర్స్ పూర్తిగా మూసేయడంతో డిస్ట్రిబ్యూట‌ర్స్, బ‌య్య‌ర్స్, థియేట‌ర్స్ నిర్వాహ‌కులు తీవ్ర గ‌డ్డుకాలాన్ని ఎద‌ర్కొంటున్నారు. చిత్ర పరిశ్రమ మూత పడడంతో చిన్న నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సినిమాల కోసం ఫైనాన్సియర్ల దగ్గర డబ్బులు తీసుకున్న కొందరు చిన్న నిర్మాతలు వడ్డీలు భరించలేక డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయడమే శరణ్యమని భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రిలీజ్ చేయాలని కొందరు నిర్మాతలు అనుకుంటున్నారు. 

 

ఈ నేపథ్యంలో హీరో సూర్య నిర్మించిన జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వంధాల్’ అనే సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయాలని భావించారు. ఐతే ఇలాంటి నిర్ణయాలు థియేటర్స్ మనుగడకే ముప్పు తెచ్చేలా ఉన్నాయన్న భయంతో సూర్యపై థియేటర్ల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై సూర్య నిర్మించే ఎలాంటి చిత్రాలను తమ థియేటర్‌ లలో విడుదల చేయబోమని తీర్మానం చేశారు. తాజాగా కేరళ సినీ థియేటర్ల సంఘం కూడా సూర్యకు షాక్‌ ఇచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో చిత్రాలను విడుదల చేయాలని తీసుకున్న సూర్య నిర్ణయాన్ని ఆ సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. తాము కూడా సూర్య నిర్మించే.. నటించే చిత్రాలను విడుదల చేయబోమని వెల్లడించింది. అయినా సూర్య వారి హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని సమాచారం.

 

కాగా మరో వైపు ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన 'మాస్టర్' మరియు ధనుష్ 'జగమే తందిరం' మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు కూడా నేరుగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులోకి రానున్నాయి అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు ఆ వార్తలను ఖండించారు. తమ చిత్రాలు థియేటర్స్ విడుదలకే మొగ్గుచూపుతున్నట్లు చెప్పుకొచ్చారు. తమిళ స్టార్ హీరోలలో సూర్య ఓటీటీ వైపు చూస్తుండగా ధనుష్ విజయ్ లు మాత్రం థియేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: