తెలుగు సినిమా చరిత్రలో ప్రేమకథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని అనేక సినిమాలు నిరూపించాయి. ఓ ప్రేమకథలో ఎన్ని మలుపులు ఉంటే ప్రేక్షకులు అంతగా ఇష్టపడతారు. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ కు ప్రేమకథల్లో సరదా సన్నివేశాలు ఉంటే మరింతగా ఇష్టపడతారు. అదే ప్రేమకథల్లో సీరియస్ నెస్ ఉండి ఆకట్టుకోగలిగే థీమ్ ఉంటే బ్లాక్ బస్టర్లు అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల కోవలోకి వచ్చే సినిమా ‘ప్రేమించుకుందాం..రా’. ఈ సినిమా వచ్చి 23 ఏళ్లు అయిన సందర్భంగా దర్శకుడు జయంత్ సి.పరాన్జీ తన అనుభవాలను పంచుకున్నారు.

 

 

‘ఈ సినిమా మెటిరియలైజ్ కావడానికి ప్రధాన కారకుడు సురేశ్ బాబు. నేను పరుచూరి బ్రదర్స్ ఓ కథపై చర్చలు చేస్తున్నప్పుడు సురేశ్ బాబు ఫోన్ చేసి ఓ లైన్ చెప్పాడు. ఆ పాయింట్ అద్భుతంగా ఉందని అన్నాను. దీన్ని డెవలప్ చేసేందుకు అనంతపురంకు చెందిన దీన్ రాజ్ అనే యువకుడిని ఈ కథ గురించి సంప్రదించాను. కథను పూర్తిగా రెడీ చేశాక పరుచూరి బ్రదర్స్ ఎంటరై మంచి స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. నేను స్వతహగా కథకుడిని, రచయితను కాను. వాళ్లు అందించిన దాన్ని నేను ఎంత అందంగా తెరకెక్కించగలను అని మాత్రమే ఆలోచించి సినిమా తెరకెక్కించగలను. అదే చేశాను’ అని చెప్పుకొచ్చారు.

 

 

వెంకటేశ్ కెరీర్లో ఉన్న బ్లాక్ బస్టర్ హిట్లలో ప్రేమించుకుందాం.. రా కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రేమికుడిగా, ప్రేమ కోసం తెగించే యువకుడిగా మెప్పించాడు. అంజలా ఝవేరి అందం, కామెడీ, పాటలు, డైలాగ్స్, జయప్రకాశ్ రెడ్డి, శ్రీహరి నటనతో పాటు రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం.. అన్నీ కొత్తగా అనిపించాయి ప్రేక్షకుడికి. జయంత్ దర్శకత్వ ప్రతిభ సినిమా ఆశాంతం రక్తికట్టించింది. సురేశ్ ప్రొడక్షన్స్ లో ఓ కలికితురాయిగా నిలిచిపోయిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: