కరోనా వైరస్ ని పాజిటివ్ గా తీసుకుంటే ప్రపంచ గమనాన్ని, మాన‌వ జీవితాన్ని ఒక్కసారిగా తల్లకిందులు చేసింది. అంతే కాదు. కొత్త జీవితానికి అలవాటుపడమని చెప్పింది. ఇప్పటి జనరేషన్ వినడమే తప్ప చూడని లైఫ్ అది. అందువల్ల కరోనా వైరస్ ఇపుడు అన్ని రంగాల్లో తనదైన మార్పులను పరిచయం చేస్తోంది.

 

అలా చూసుకుంటే వెండితెర వెలుగు జిలుగుల్లో కూడా కరోనా మహిమ కనిపిస్తోంది. ఇకపైన సినిమాలు ఏళ్లకు ఏళ్ళు తీయకూడదని టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు నిర్ణయించుకుంటున్నారుట. సుదీర్ఘ కాలం సినిమాలు తీస్తే దాని వల్ల ఎక్కువగా  నష్టంతో పాటు ఎన్నో కష్టాలు కూడా ఉంటాయని, వాటిని భర్తీ చేసుకోవడం కూడా కరోనా తరువాత మారిన చిత్ర పరిశ్రమ, ఆడియన్స్ వైఖరితో అసాధ్యం అవుతుందని భావిస్తున్నారుట.

 

ఎంత వీలు అయితే అంత తొందరగా సినిమాను తీయాలని మెజారిటీ ఫిల్మ్ మేకర్స్ డిసైడ్ అయిపోతున్నారుట. దీని వల్ల సినిమా వ్యయం తగ్గడమే కాకుండా ఒక వేళ సరైన ఫలితం రాకపోయినా తక్కువ నష్టంతో బయటపడవచ్చునని ఆలోచిస్తున్నారుట. ఇక ఆడియన్స్ పల్స్ పట్టుకోవడానికి కూడా  తక్కువ సమయమే బెటర్ అని, అదే దీర్ఘ కాలం అయితే బెడిసికొట్టేసేలా  అవుతుందని ఆలోచిస్తున్నారుట.

 

ఆడియన్స్ మూడ్ చూసి వెంటనే సినిమా తీసి రిలీజ్ చేస్తే ఆ ఫలితాలు బాగుంటాయని అంటున్నారు. ఇక ఒక సినిమాను ఏళ్లకు ఏళ్ళు తీసే డైరెక్టర్లకు దూరంగా ఉండాలని హీరోలు కూడా ఆలోచిస్తున్నారుట. అదే విధంగా హీరోలు కొందరు కధలో వేళ్ళూ కాళ్ళూ  పెడుతూ స్టోరీ డిస్కషన్ కే నెలలు మింగేస్తున్న ఘటనలు ఇంతవరకూ జరిగాయి.

 

ఇపుడు అలా నస పెట్టే హీరోల వద్ద పనిచేయకూడదని మెజారిటీ డైరెక్టర్లలో వినిపిస్తున్న మాట. నిర్మాతల వరకూ వస్తే తక్కువ పెట్టుబడికి తొందగా సినిమా తీసి ఇచ్చే డైరెక్టర్, హీరో కోసమే చూస్తున్నారని అంటున్నారు. మొత్తానికి కరోనా వచ్చిన తరువాత టాలీవుడ్లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ధోరణి కూడా పెరుగుతోంది. మరి ఇది బద్దకిస్టులకు, పెర్ఫెక్షన్ అంటూ ఒక్క సినిమాకే వేయి రంగులు పూస్తూ ఏళ్ళకు ఏళ్ళు  తీసే వారికి, పరమ  చాదస్తులకు కాని కాలమేనని చెప్పాలేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: