ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో పరిస్థితులు అదుపుతప్పకుండా తమ బాధ్యతను అంకితభావంతో నెరవేరుస్తోంది పోలీస్ వ్యవస్థ. శాంతిభద్రతలే కాకుండా మానవీయకోణంలో వారు చేస్తున్న సేవలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళా పోలీస్ ఆఫీసర్ శుభశ్రీ కొన్ని రోజుల క్రితం ఓ మతిస్థిమితం లేని మహిళకు ఆహారం తినిపించటం ఆ రాష్ట్ర సీఎంతో పాటు దేశ వ్యాప్త మన్ననలు అందుకుంది. ఆమె చేసిన సేవ మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆకట్టుకోవడంతో ఆమెతో వీడియో కాల్ లో మాట్లాడి అభినందించారు. ఆ వీడియోను మెగాస్టార్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

 

 

ఒడిశా రాష్ట్రంలోని మల్కింగిరి జిల్లాలో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు శుభశ్రీ నాయక్. చిరంజీవి ఆమెతో మాట్లాడుతూ.. ‘కొన్ని రోజుల క్రితం మీరు మతిస్థిమితం లేని మహిళకు భోజనం తినిపిస్తున్నారు. ఆ చర్య నా మనసుని తాకింది. ఆమె పట్ల మీరు చూపిన మానవత్వానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు. ఆమెకు సాయం చేయాలని మీకెలా అనిపించింది అని చిరంజీవి అడగ్గా.. ‘ఆ సమయంలో ఆవిడ తన చేతులతో ఆహారం తీసుకునే పరిస్థితుల్లో లేదు. మానసికంగానూ, అంగవైకల్యంతోనూ ఆమె బాధ పడుతోంది’ అని శుభశ్రీ చెప్పారు.

 

 

ఇందుకు చిరంజీవి.. ‘మీలో సానుభూతి నిండిన తల్లి హృదయాన్ని చూసాను. మీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.’ అన్నారు. శుభశ్రీ కూడా చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ‘మీరు నాతో మాట్లాడతారని తెలియగానే నేను ఎగ్జైట్ అయ్యాను. నేను మీకు అభిమానిని. మీ సినిమాలు చూశాను. మీరు చేసిన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందాను. టూరిజం శాఖ మంత్రిగా చాలా అభివృద్ది చేశారు.’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: