కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారు. తన సంపాదనలో చాలా వరకు ఆయన సామాజిక సేవకే వినియోగిస్తున్నారు. ఎంతో మంది అనాధలను, పేదలను ఆయన కష్టకాలంలో ఆదుకుంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ కష్టకాలంలోనూ ఆయన పేదలకు అండగా నిలబడ్డారు. ఇండస్ట్రీలో ఉపాధి కోల్పోయిన ఎంతో మందిని ఆదుకున్నారు. ఇప్పటికే కరోనా రిలీఫ్ కింద ఆయన రూ.3 కోట్లు ప్రకటించారు. ఇందులోంచి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 50 ల‌క్ష‌లు, ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 50 ల‌క్ష‌లు, డాన్సర్స్ అసోషియేషన్‌కు రూ.  50 లక్షలు, సినిమా కార్మికులకు రూ. 50 లక్షలు, వికలాంగులకు రూ. 25 లక్షలు, తన సొంత ఊరు రాయ‌పురం వాసుల‌కు రూ. 75 ల‌క్ష‌లు లారెన్స్ అందించారు. అక్కడితో ఆగకుండా తన సహాయాన్ని విస్తరిస్తూ వస్తున్నాడు. అనాథలకు నిరుపేదలకు అన్నదానాలు చేస్తున్నాడు. డాన్సర్స్ సంక్షేమానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.

 

రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనా లాక్‌ డౌన్‌ తో తమిళనాడులో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని వారి స్వస్థలాలకు పంపడానికి లారెన్స్ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తమిళ నాడు ముఖ్యమంత్రి పళని స్వామికి ధన్యవాదాలు తెలిపారు. 37 మంది ఆంధ్రప్రదేశ్‌ వాసుల తరఫున కొన్ని రోజుల క్రితం నేను ముఖ్యమంత్రి పళనిస్వామికి ఓ వినతిపత్రం సమర్పించా. లాక్‌ డౌన్‌ తో తినడానికి ఆహారం లేక తమిళనాడులో చిక్కుకున్న వీరిని స్వస్థలాలకు పంపేందుకు రవాణా సౌకర్యం కల్పించమని కోరా. ముఖ్యమంత్రి స్పందించారు. ఆయన సెక్రటరీ విజయ్‌కుమార్‌ నన్ను సంప్రదించి వివరాలు అడిగారు. కేవలం ఒక్క వారంలో ఏపీ వాసుల్ని రైలులో వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. అడిగిన వెంటనే సాయం చేసిన ముఖ్యమంత్రి గారికి.. ఆయన సెక్రెటరీ విజయ్ కుమార్ కు నా ధన్యవాదాలు అని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: