కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా.. తెర‌కెక్కిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించింతో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కన్నడ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రమిది. ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో వ‌చ్చిన కెజీఎప్ 1  పెను ప్ర‌కంప‌న‌లు క్రియేట్ చేసింది. అంత‌కుముందు వ‌ర‌కు క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌ప్ప బ‌య‌ట ఎవ‌రికీ తెలియ‌ని య‌శ్.. ఈ ఒక్క సినిమాతో ఓవ‌ర్ నైట్ సూప‌ర్ స్టార్ అయిపోయాడు. అదే టైమ్‌లో ప్ర‌శాంత్ నీల్ ట్యాలెంట్.. హోంబ‌లే బ్యాన‌ర్ గురించి ఈ సినిమా వ‌ల్ల‌నే ప్ర‌పంచానికి తెలిసింది. ఇక కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో రికార్డ్‌ వసూళ్లు సాధించింది.

 

ముఖ్యంగా బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన కేజీఎఫ్‌, సౌత్‌ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది. అయితే ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్‌. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందిస్తున్నారంటూ వార్తలు సైతం వస్తున్నాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యం అయ్యింది. 

 

దాంతో ఈ ఏడాది అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా దెబ్బ‌కు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కేజీఎఫ్ షూటింగ్‌కు కూడా బ్రేక్ ప‌డ‌డంతో.. ఈ చిత్రం అనుకున్న టైమ్‌కు రిలీజ్ అవ్వ‌డం క‌ష్ట‌మే. ఇక తాజాగా కన్నడ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. అంటే.. కేజీఎఫ్‌ 2 చిత్రంను వచ్చే ఏడాదిలో సమ్మర్‌ లేదా దసరా సీజన్‌కు రిలీజ్ చేయాలని చిత్ర‌యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: