కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీలోని చిన్న నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పూర్తయిన సినిమాలు థియేటర్లలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేక తలబాదుకుంటున్నారు. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. ఇక చేసేదేమీ లేక డిజిటల్ ప్లాట్‌ఫాంలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో ఇప్పటికే ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైపోయింది. తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు అదే బాటలో కీర్తి సురేష్ సినిమా వెళ్తోంది. 

 

తాజాగా 'మహానటి' కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘పెంగ్విన్’చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌ గా ప్ర‌క‌టించారు. తమిళం మరియు తెలుగు వర్షన్లను ఒకేసారి విడుదల చేయడానికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ తో నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఈ వేసవికి ‘పెంగ్విన్’ విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌ డౌన్ కారణంగా కుదరలేదు. దీంతో ఓటీటీ రిలీజ్ కి వెళ్తున్నారు. థియేటర్స్ రిలీజ్ ప్రకటించి.. ఇప్పుడు ఓటీటీలో విడుదల కాబోతున్న ఫస్ట్ క్రేజీ మూవీగా 'పెంగ్విన్' నిలవనుంది. 'పేట' 'పిజ్జా' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ - కార్తికేయన్ సంతానం - కాల్ రామన్ - ఎస్.సోమసేగెర్ - కళ్యాణ్ సుబ్రమణియన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ లేడీగా కనిపించనుందని టాక్. ఏదేమైనా నిర్మాతలందరూ లాక్ డౌన్ వల్ల ఓటీటీ లకే ఓటేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: