మహానటి సినిమా తర్వాత జెమిని గణేష్ సావిత్రి పెళ్లి గురించి ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. ఈ సినిమాలో సావిత్రి ఎలా మహానటి గా మారిందో... జెమినీ గణేషన్ ను వివాహమాడి ఎటువంటి దురవస్థలో చనిపోయిందో చాలా చక్కగా చూపించాడు నాగ్ అశ్విన్. అయితే నిజ జీవితంలో సావిత్రి భర్త జెమిని(రామస్వామి) గణేశన్ డాక్టర్ కావాలని అనుకున్నాడు. కానీ 19 ఏళ్ళ వయసులో తన తండ్రి కోరిక మేరకు అలమేలు అనే ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత తన మామయ్య చనిపోవడంతో... బతుకు తెరువు కోసం సినిమా లో ఆరంగేట్రం చేశాడు.


క్యాస్టింగ్ అసిస్టెంట్ గా జెమినీ స్టూడియోస్ లో పనిచేసిన రామస్వామి గణేషన్ కి జెమినీ గణేషన్ అనే ముద్దు పేరు వచ్చింది. అందరూ అలాగే పిలవడంతో అతని పేరు జెమినీ గణేషన్ గా మారిపోయింది. సినిమాల్లో నటించేందుకు వచ్చినవారికి ఆడిషన్స్ నిర్వహిస్తున్న క్రమంలో జెమినీ గణేషన్ సావిత్రికి పరిచయమయ్యింది. మొదటి పరిచయంలోనే నీ నవ్వు బాగుంది అంటూ సావిత్రికి చెప్పి ఆమె ఫోటోలు తీయించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆమెను కలసి నీలో ఏదో గొప్ప టాలెంటు ఉందని ఆమెతో మాటలు కలిపాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా సావిత్రి సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. పెళ్లి చేసి చూడు సినిమా లో సావిత్రి గుర్తింపు రాగా... ఆ సమయంలోనే జెమినీ గణేషన్ తాయి ఉల్లం సినిమాలో ప్రతినాయకుడిగా నటించి గొప్ప స్టార్ గా ఎదిగాడు.


1953 నవంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన మనమ్ పోలా మంగల్యం చిత్రంలో సావిత్రి జెమిని గణేషన్ కలిసి నటించారు. ఆ సినిమా అప్పట్లో భారీగా విజయవంతం అయ్యింది.మనమ్ పోలా మంగల్యం చిత్రీకరణ సమయంలో సావిత్రి జెమిని గణేషన్ మధ్య ప్రేమ చిగురించి వివాహానికి దారితీసింది. తదనంతరం వాళ్ళిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకొని సంసారం మొదలుపెట్టారు. నిజానికి అప్పటికే జెమినీ గణేషన్ అలమేలు ని పెళ్లి చేసుకొని తన కోస్టార్ అయిన పుష్పవల్లి తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఇవన్నీ తెలిసిన సావిత్రి తాను జెమినీ గణేషన్ ని పెళ్లి చేసుకున్నాను అని తెలిస్తే నలుగురు నవ్వుతారని తన వివాహాన్ని గోప్యంగా ఉంచింది.


ఒకానొక రోజు సోప్ యాడ్ చేస్తున్న సమయంలో 'సావిత్రి గణేషన్' అని సంతకం చేయగా... వీళ్ళిద్దరి రిలేషన్ షిప్ బయటపడింది. అప్పట్లో ఈ వార్త పెద్ద దుమారమే రేపింది. సినీ ఇండస్ట్రీ నుండి సామాన్యుడి వరకు సావిత్రి జెమిని గణేషన్ కి మూడవ భార్య అయిందని అందరూ చెవులు కొరుక్కున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి హీరో హీరోయిన్లగా అనేక సినిమాల్లో నటించారు. ఒకవైపు తన కెరీర్ అద్భుతంగా కొనసాగుతుండగా... మరోవైపు తన వ్యక్తిగత జీవితం ఏ చీకు చింతా లేకుండా కొనసాగుతుంది. సావిత్రికి దాన గుణం ఎక్కువ. సావిత్రి, జెమిని గణేషన్ కలసి ఆర్మీ వాళ్లకి, చిన్నపిల్లలకు, అనాధలకు ఇంకా ఎంతో మంది పేదవారికి లక్షల రూపాయల్లో విరాళాలు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తగాదా అయ్యింది. సావిత్రి సినిమా రంగం లో ఎదురులేని నటీమణిగా అంచలంచలుగా ఎదుగుతూ పోతుంటే... జెమినీ గణేషన్ పాపులారిటీ పడిపోతూ వచ్చింది. దీంతో జెమినీ గణేషన్ తనతో తరచూ గొడవ పెట్టుకునేవాడు.



సావిత్రి ఎప్పుడైతే దర్శకురాలిగా ప్రొడ్యూసర్ గా అవతారమెత్తిందో... అప్పటినుండి ఆమెకు భారీ స్థాయిలో నష్టాలు వాటిల్లాయి. ఆర్థికంగా కృంగిపోయిన ఆమె జీవితంలో అనేక కుటుంబ పరమైన సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఆ క్రమంలోనే జెమినీ గణేషన్ వేరొక యువతి తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే విషయం తెలిసి ఆమె గుండె పగిలిపోతుంది. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక... భర్త చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక ఆమె మందు తాగడం ప్రారంభించింది. అలాగే ఆమెని ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు సావిత్రి మద్యం పొద్దస్తమానం స్వీకరించేది. ఒకరోజు ఎక్కువ ఆల్కహాల్ తాగడం వలన కోమాలోకి వెళ్లిన ఆమె 19 నెలల తర్వాత దీనస్థితిలో మరణించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: