తెలుగులో ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో రామ్. ఈ బిరుదు కేవలం ఇస్మార్ట్ శంకర్ వంటి మాస్ సినిమా చేసినందుకు రాలేదు. తన మొదటి సినిమా దేవదాస్ చూసిన ఎవరికైనా ఈ బిరుదు రామ్ కు ఎందుకు వచ్చిందో, ఎప్పటి నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. చేసే ప్రతి సినిమాలో తన నటనతో ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు రామ్. రెగ్యులర్ ప్రేమకథల నుంచి రామ్ కు లభించిన మంచి యూటర్న్ ఇస్మార్ట్ శంకర్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తన ఆలోచనలనే మార్చేసిందంటున్నాడు. నేడు రామ్ పుట్టినరోజు.

 

 

తనకు ఇస్మార్ట్ శంకర్ మంచి బూస్టప్ ఇచ్చిందని ఇందుకు ప్రధాన కారణం పూరి జగన్నాధ్ అని చెప్తున్నాడు. పూరిని కలిసినప్పుడు తన మాటలు విన్నాక కొత్తగా ఏదో చేయాలనే తపన వచ్చిందని ఆ విషయమే పూరికి చెప్పానని అంటున్నాడు. నువ్వు లవర్ బాయ్ వి కాదు నీలో ఉన్న స్పెషల్ ఏంటో నేను చూపిస్తాను అని పూరి ఇస్మార్ట్ శంకర్ తీసాడని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో తానేం చేయాలో తెలుసుకున్నానని అంటున్నాడు. ఇస్మార్ట్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు కాబట్టి.. ఇకపై వారు ఆశ్చర్యపోయే సినిమాలే చేయాలనుందని అంటున్నాడు. ఇస్మార్ట్.. రామ్ కెరీర్ కు బూస్టప్ ఇస్తే పూరికి సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.

 

 

ప్రస్తుతం రామ్ చేసిన రెడ్ ఈసరికే రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో విడుదల వాయిదా పడింది. ఈ సినిమా రీమేకే అయినా కథలో మన నేటివిటీకి తగ్గట్టు కిశోర్ తిరుమల మార్పులు చేశాడని అంటున్నాడు. ఈ సినిమాలో తాను చేసిన డ్యూయల్ రోల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంటున్నాడు. రామ్ లో మాస్ ఎనర్జీని జగడం సినిమాలోనే చూపించాడు సుకుమార్. కానీ.. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ సక్సెస్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: