నాని హీరోగా తెరకెక్కిన 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు నాగ్ అశ్విన్. ‘మ‌హాన‌టి’ సినిమాలతో ఇండ‌స్ట్రీలో చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు యువ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. మహానటి సావిత్రి జీవితాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించి.. అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మహానటి సావిత్రికి నిజమైన నివాళిగా 'మహానటి'ని తెరకెక్కించాడని యావత్ సినీ లోకం నాగ్ అశ్విన్‌ను కొనియాడింది. ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు.. ఎంతమంది చెప్పుకునేలా తీశామన్నదే నాగ్ అశ్విన్ ఫార్మూలా అన్నట్టు కనిపిస్తోంది. అందుకే మహానటి విడుదలై రెండేళ్లు అయినా.. మరో ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. మహానటి తరువాత ఎలాంటి చిత్రాన్ని చేస్తాడని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా కాదని, ప్రపంచ స్థాయిలో ఉంటుందని స్వయంగా నాగ్ అశ్వినే చెప్పుకొచ్చాడు.

 

కాగా ప్ర‌స్తుతం లాక్ డౌన్ నేప‌థ్యంలో రిలీజ్ కాని సినిమాల‌న్నీ ఓటిటి ప్లాట్ ఫామ్స్ నుంచి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో థియేట‌ర్స్ భ‌విష్య‌త్ ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఓ క్రేజీ థాట్ తో ముందుకు వచ్చాడు నాగ్ అశ్విన్. విదేశాల్లోలాగా..మ‌న ద‌గ్గ‌ర కూడా థియేట‌ర్స్ కి బీర్, బ్రీజ‌ర్, వైన్ లాంటివి స‌ప్లై చేసే విధంగా లైసెన్స్ ఇస్తే… జ‌నాన్ని థియేట‌ర్స్ కు తీసుకురావొచ్చేమో అంటూ త‌న అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు. ఇదే విష‌యాన్ని గ‌తంలో నిర్మాత సురేష్ బాబు, హీరో రానా వ‌ద్ద కూడా ప్ర‌స్తావించినట్టు తెలిపాడు. ఈ సూచ‌న మంచిదో, కాదో తెలిపాలంటూ నెటిజ‌న్ల అభిప్రాయం కోరాడు నాగ్ అశ్విన్.

 

నాగ్ అశ్విన్ ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే మ‌రో ట్వీట్ తో ముందుకు వ‌చ్చాడు. ఈ విధంగా చెయ్య‌డం వ‌ల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ థియేట‌ర్స్ కి దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. కానీ ఆప్ష‌న‌ల్ గా కొన్ని మ‌ల్లిప్లెక్సుల్లో ట్రై చెయ్యెచ్చెమో అని అభిప్రాయ‌ప‌డ్డాడు. మ‌రి థియేట‌ర్స్ కి జనాన్ని తీసుకురావ‌డం ఎలా అని ప్ర‌శ్నించాడు. ఒక‌వేళ లాక్ డౌన్ ఎత్తేసిన అనంత‌రం వెంట‌నే థియేట‌ర్స్ కి వ‌స్తారా..లేక కొన్ని వారాలు వెయిట్ చేస్తారా.. అంటూ నెటిజ‌న్ల అభిప్రాయం కోరాడు నాగ్ అశ్విన్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: