ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ సినిమాలు తీసే దర్శకులు తక్కువ మంది  ఉన్నారు. ఒకరిద్దరు మాస్ డైరెక్టర్లు కూడా తమ పంధా మార్చి ట్రెండుకి తగ్గట్టు సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. కానీ ఒక డైరెక్టర్ మాత్రం మాస్ మసాలా సినిమాలు తీసుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను. మరోవైపు నటరత్న నందమూరి బాలకృష్ణ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోస్ట్ పవర్ ఫుల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారని సమాచారం.

 

బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ' 'లెజెండ్' సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కరోనా లాక్‌ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని వార్తలు వస్తున్నాయి. అయితే బడ్జెట్ లెక్కలు తగ్గించినా కూడా దర్శకుడు మాత్రం తగ్గడం లేదు. బాలకృష్ణ గత సినిమాలు ఎలాంటి రిజల్ట్ ని అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మరోవైపు దర్శకుడు బోయపాటి కూడా హిట్టు చూసి చాలా కాలమవుతోంది.

 

బాలకృష్ణ - బోయపాటి అనగానే ముందుగా వారి మునుపటి సినిమాల కంటే హై రేంజ్ లో ఉండాలని ఆడియెన్స్ కోరుకుంటారు. కానీ బోయపాటి కొన్నిసార్లు అనుకున్న బడ్జెట్ కంటే హై రేంజ్ లో సినిమాను తీస్తారని టాక్ ఉంది. మంచి ప్రాడక్ట్ రావాలంటే కొన్నిసార్లు బడ్జెట్ పెంచక తప్పదు. కానీ సినిమా మార్కెట్ పరిధి కూడా చూసుకోవాలి. బోయపాటి శ్రీనివాస్ వీలైనంత వరకు తన సినిమాల్లో పెద్ద స్టార్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. వారిని ఉపయోగించుకోవడంలో సిద్ధహస్తుడే అయినప్పటికీ.. ప్రస్తుతం మార్కెట్ కి తగ్గట్టుగా కాస్త డిఫరెంట్ గా ఆలోచించి వెళితే మంచిదనే టాక్ వస్తోంది. ఇక సినిమాలో శ్రీకాంత్ నెగిటివ్ పాత్రలో నటిస్తుండగా.. మరో బాలీవుడ్ యాక్టర్ ని కూడా విలన్ పాత్రలో చూపించాలని అనుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: