లాక్డౌన్ కారణంగా మన జీవితాలన్నీ తలకిందులుగా మారిపోయాయి. అంతకుముందు వేసుకున్న ప్లాన్ లన్నీ చేంజ్ అయ్యాయి. ప్రశాంతంగా బ్రతుకుతున్న మన జీవితాల్లోకి కరోనా మహమ్మారి ప్రవేశించి, మనశ్శాంతిని దూరం చేసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కు బిక్కుమంటూ గడపడం అలవాటైంది. ఈ మహమ్మారి ధాటికి మన ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది.

 


కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరిశ్రమలు మూతబడ్డాయి. ఎవ్వరికీ పనిలేదు. కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. లాక్డౌన్ వల్ల రోజువారి కూలీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రెక్కాడితే కానీ డొక్కాడని వీరి బ్రతుకులు మరీ దుర్భరంగా తయారయ్యాయి.  కరోనా వల్ల సినిమా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతబడిపోవడంతో సినీ కార్మికులతో పాటు థియేటర్లలో పనిచేసే కార్మికులు నష్టపోతున్నారు.

 

ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు థియేటర్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదట. థియేటర్లు మూతబడిపోవడంతో థియేటర్ కి రెవెన్యూ రాలేదు. అందువల్ల కార్మికులకి కూడా ఎలాంటి జీతాన్ని ఇచ్చుకోలేకపోయారట. అయితే థియేటర్ కార్మికులు దీనికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. తమకు పూర్తి వేతనాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన దీక్ష చేశారు. 

 

సినిమా థియేటర్ యజమానులు థియేటర్‌లో పనిచేసే కార్మికులకు మార్చి, ఏప్రిల్ నెల జీతాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారట. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న యజమానుల పై కఠిన చర్యలు తీసుకొని సకాలంలో జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. రోజువారి కూలీల వెతల బాధలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందా లేదా చూడాలి.  నాలుగవ విడత లాక్డౌన్ లో భాగంగా కేసీఆర్ అన్ని షాప్స్ ని ఓపెన్ చేసుకోవచ్చని చెప్పాడు. కానీ థియేటర్లు, మాల్స్ కి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి మరికొన్ని రోజులు ఆ కార్మికులకి ఇలాంటి ఇబ్బందులు తప్పవేమో..!

మరింత సమాచారం తెలుసుకోండి: