జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున ఆర్.ఆర్.ఆర్ నుండి వస్తుందనుకున్న ఫస్ట్ లుక్, అనేక కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోతున్నామని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలన్న కుతూహలం ఉప్పొంగిపోతున్న తరుణంలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్రకటన అభిమానులని తీవ్రంగా నిరాశపర్చింది. లాక్డౌన్ నియమాల వల్ల ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన ఇంట్రో షాట్స్ తీయలేదని, అందువల్ల బర్త్ డే రోజు వీడియో విడుదల చేయలేకపొతున్నాం అని ప్రకటించింది.

 

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఆర్.ఆర్.ఆర్ టీమ్ పై కొంత కోపంగానే ఉన్నారని చెప్పుకోవాలి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ని చూసినప్పటి నుండి, రామ్ చరణ్ వీడియోకి ఎన్టీఆర్ గొంతు విన్నప్పటి నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ అదిరిపోనుందన్న వార్తలు రావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అవన్నీ అడియాశలైపోయాయి. అదలా ఉంచితే తాజాగా ఎన్టీఆర్ కి పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వడానికి యంగ్ హీరో రెడీ అవుతున్నాడు.

 

ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ఫలక్ నుమాదాస్ చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుని, ఈ మధ్యే రిలీజైన హిట్ సినిమాతో తనలోని నటుడిని సంతృప్తి పర్చుకున్న విశ్వక్ సేన్, యంగ్ టైగర్ కి బర్త్ డే కానుక ఇవ్వబోతున్నాడు. ఎన్టీఆర్ గురించి ర్యాప్ సాంగ్ పాటని రిలీజ్ చేయనున్నాడట. ఈ మేరకు సోషల్ మీడీయా ద్వారా వెల్లడి చేశాడు. ‘మాస్ కా దాస్‌, మాస్ కా బాప్‌’ పేరుతో సాగే ఈ గీతాన్ని ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నాడు. 

 

స్వ‌త‌హాగా విశ్వ‌క్ సేన్ ఎన్టీఆర్ ఫ్యాన్‌. ఎన్టీఆర్‌పై త‌న ఇష్టాన్ని ఈ పాట రూపంలో చూపించుకోబోతున్నాడు. ఆర్.ఆర్.ఆర్ నుండి ఫస్ట్ లుక్ టీజర్ రాకపోయినా, ఈ ర్యాప్ సాంగ్ ద్వారా కొంతవరకైనా అభిమానులు సంతృప్తి పడతారేమో..!

మరింత సమాచారం తెలుసుకోండి: