తెలుగు సినిమా వైభవంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ కు ఘన చరిత్ర ఉంది. ఆ బ్యానర్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు వచ్చాయి. ఇందుకు విరుద్ధంగా భారీ ఫ్లాపులు కూడా వచ్చాయి. వైజయంతీ బ్యానర్ ప్రతిష్ట పెంచేలా.. వైజయంతీ సంస్థ సినిమా అని చెప్పుకునేలా సినిమాలు తీశారు అశ్వనీదత్. అటువంటి ఆణిముత్యాల్లో ఒకటి ‘శుభలగ్నం’. ఈ సినిమా గొప్పదనాన్ని, వైభవాన్ని సినిమాలో హీరోగా నటించిన జగపతిబాబు కొన్ని విశేషాలను చెప్పుకొచ్చారు. ఆ వీడియోని వైజయంతీ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

 

 

‘అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగార్జున, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తీసిన గోవిందా గోవిందా ఫ్లాప్ అయింది. సెన్సార్ బోర్డు చెప్పిన 50 కట్స్ సినిమా ఫలితాన్ని శాసించాయి. కానీ.. ఒకటి పోగొట్టుకుంటే మరోటి ఇచ్చే ఆ ఏడుకొండలవాడు దత్తు గారికి మలి అవకాశం ఇచ్చాడు. అప్పట్లో క్రేజీ డైరక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఓరోజు దత్తు గారికి ఫోన్ చేసి మీతో సినిమా చేస్తానని అన్నారు. మంచి ఫ్యామిలీ సబ్జెక్టుతో నన్ను హీరోగా పెట్టి తీసిన ‘శుభలగ్నం’ అఖండ విజయం సాధించింది. దత్తు గారికి శుభాన్ని ఇచ్చింది’.

 

 

‘ఫ్యామిలీ హీరోగా, మహిళా ప్రేక్షకులకు నన్ను దగ్గర చేసింది. దత్తు గారి భార్య.. ఈ సినిమా మన పాలిట శుభలగ్నమే అని చెప్పుకుంటారు’ అని జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. ఈ సినిమా సాధించిన సంచలన విజయంతో గోవిందా గోవిందా సినిమాతో వచ్చిన నష్టాలు పోయి పైన లాభాలు వచ్చాయి. అంతటి మహిళా ప్రేక్షకాదరణతో ఈ సినిమా 100 రోజులు ఆడింది. కామెడీతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ ను సమపాళ్లలో తెరకెక్కించే కృష్ణారెడ్డి పేరు మరింతగా మోగిపోయింది. వైజయంతీ బ్యానర్ లో ఓ క్లాసిక్ ఫ్యామిలీ మూవీగా నిలిచిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: