ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దురా ఓట‌మి.. 
ఎప్పుడూ వ‌దులుకోవ‌ద్దురా ఓరిమి..!
విశ్ర‌మించ‌ వ‌ద్దు ఏక్ష‌ణం.. 
విస్మ‌రించ‌ వ‌ద్దు నిర్ణ‌యం..
అప్పుడే నీ జ‌యం.. నిశ్చ‌యంరా..! 
నింగి ఎంత పెద్ద‌దైన.. 
రివ్వుమ‌న్న గువ్వపిల్ల రెక్కముందు త‌క్కువేనురా..!
సంద్ర‌మెంత గొప్ప‌దైన
ఈదుతున్న చేప‌పిల్ల మొప్ప‌ముందు చిన్న‌దేనురా..! 
అంటూ సాగే ఈ పాట సిరివెన్నెల‌ సీతారామ‌శాస్త్రికి అత్యంత ఇష్ట‌మైన పాట‌. సీతారామ‌శాస్త్రి పాట ఒక స్ఫూర్తిమంత్రంగా సాగుతుంది. మ‌న ల‌క్ష్యాన్ని గుర్తు చేస్తుంది. మ‌న ఆశ‌యాన్ని ముందుకు న‌డిపిస్తుంది. ఇంత‌టి అద్భుత‌మైన సాహిత్యాన్ని సృష్టించిన సీతారామశాస్త్రి తెలుగుర‌చయిత‌కావ‌డం మ‌నంద‌రికీ ఎంతో గ‌ర్వ‌కార‌ణం. ఆయ‌న పాట ఎన్నడు కూడా ఈ నేల‌ను, ఈ గాలిని మ‌ర‌వ‌లేదు.. దూరంగా పోలేదు. ఆయ‌న పాట‌లో ఈ మ‌ట్టివాస‌న గుప్పుమంటోంది. ఈ గాలి ప‌రిమ‌ళం గుబాళిస్తోంది. వంద‌ల సినిమాల‌కు అద్భుత‌మైన పాట‌ల్ని అందించిన ఆయ‌న ఎనాడు కూడా సాహిత్య‌సేద్యాన్ని ఆప‌లేదు. ఆయ‌న క‌లం నిత్య‌నూత‌నంగా వ‌ర్ధిల్లుతూనే ఉంది. తెలుగునేల‌పై ఆయ‌న క‌ల‌సం సిరిసంప‌ద‌లు సృష్టించింది. వంద‌లాది పాట‌లు ఆయ‌న క‌లం నుంచి జాలువారాయి. ప్ర‌తీ పాట‌కూడా స‌మాజ‌హిత‌మే కోరింది.. ఈ రోజు ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తెలుగు ప్ర‌జ‌లు ఆయ‌న పాట‌ల‌ను గుర్తుచేస‌కుని మురిసిపోతున్నారు. త‌న్మ‌య‌త్వంతో ఊగిపోతున్నారు. నిజానికి.. చెంబోలు సీతారామ శాస్త్రి జనని జన్మభూమి (1984) చిత్రానికి గీత రచయితగా అరంగేట్రం చేశారు. కానీ.. సిరివెన్నెల చిత్రంలోని తన పాటల తర్వాత మంచి గుర్తింపు పొందారు.

 

సినిమా టైటిల్ సిరివెన్నెలా అతని పేరు ముందు చేరిపోయి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా స్థిర‌ప‌డిపోయారు. ఈ సినిమాలోని ప్ర‌తీపాట కూడా ఒక అద్భుత‌మ‌నే చెప్పాలి. సీతారామ‌శాస్త్రి అందించిన సాహిత్యానికి త‌న సంగీతంతో కేవీ మ‌హాదేవ‌న్‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తన గాత్రంతో ప్రాణం పోశారు. ఇక అప్ప‌టి నుంచి సీతారామ‌శాస్త్రి వంద‌లాది సినిమాల‌కు పాట‌లు అందించారు. ఆయ‌న క‌లం నుంచి జాలువారిన ప్ర‌తీపాట మ‌నిషి జీవ‌న‌గ‌మ‌నాన్ని తెలిపేదే. అందులోనూ ముఖ్యంగా తెలుగుద‌నం ప‌లుముకుని నిండుగా ఉంటుంది. విన‌సొంపుగా ఉంటుంది.. ఇంత అద్భుత‌మైన సాహిత్యాన్ని సృష్టించిన ఆయ‌న‌.. ఎన్నో అవార్డుల‌ను అందుకున్నారు. స్వ‌యంకృషి, స్వ‌ర్ణ‌క‌మ‌లం, సంసారం ఒక చ‌ద‌రంగం, శృతిల‌య‌లు ఇలా.. ఎన్నో సినిమాల‌కు.. మ‌రెన్నో సినిమాల‌కు ఆయ‌న అపూర్వ‌మైన పాట‌ల‌ను అందించి, ఆ సినిమాల విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌లుమార్లు నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు.. ఇత‌ర సాహిత్య అవార్డులు అందుకున్నారు. ఇలా త‌న పాట‌ల‌తో తెలుగునేల‌ను సుసంప‌న్నం చేస్తున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ నేప‌థ్యంలోనే 1986, 1987, 1988 సంవత్సరాల్లో వరుసగా మూడు సంవత్సరాలలో నంది అవార్డులను గెలుచుకున్న మొదటి ర‌చ‌యిత‌గా ఆయన గుర్తింపు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: