తెలుగులోకి ఇతర భాషల నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. భాష, నటులతో సంబంధం లేకుండా ఇతర భాషల నుంచి ఏ సినిమా వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. పండగలు, సెలవులు సమయాల్లో కూడా స్ట్రైట్ తెలుగు సినిమాలతో పోటీగా పలు డబ్బింగ్ సినిమాలు విడుదలవుతాయి. ఇందులో తమిళ సినిమాల హవా ఎక్కువ. గత రెండు సంక్రాంతి పండగ సందర్భాల్లో రజనీకాంత్ సినిమాలు వచ్చాయి.. వచ్చే సంక్రాంతికి కూడా మరో సినిమా మన తెలుగు సినిమాలతో పోటీ పడుతోంది. ఈ పద్ధతిని తమిళ, కన్నడ పరిశ్రమల్లో స్వాగతించరు.

 

 

టాలీవుడ్ ఓ దశలో డబ్బింగ్ సినిమాలదే హవా నడిచిందా అన్నట్టు సాగింది. భారతీయుడు, ప్రేమ దేశం, ప్రేమలేఖ, ముత్తు, నరసింహ, భామనే సత్యభామనే.. ఇలా ఎన్నో సినిమాలు తొంభై దశకం చివర్లో వచ్చి తమ సత్తా చాటాయి. తమిళ కథలు రీమేక్ కావడం, తమిళ దర్శకులు తెలుగులో చేయడం, డబ్బింగ్ హడావిడి ఎక్కువగా సాగింది. ముఖ్యంగా 2005లో తమిళ సినిమాలు తెలుగులో విపరీతంగా ప్రభావం చూపాయి. చంద్రముఖి, అపరిచితుడు, గజిని, ప్రేమిస్తే, మన్మథ, యువకులు.. వంటి సినిమాలు తెలుగులో డబ్ అయి ఆ ఏడాది స్ట్రైట్ తెలుగు సినిమాలనే డామినేట్ చేశాయి. ఓ అంచనా ప్రకారం ఆ ఏడాది తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా 100 కోట్ల బిజినెస్ అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

 

 

ఇప్పటికీ డబ్బింగ్ సినిమాల వెల్లువ కొనసాగుతున్నప్పటికీ గతానికి భిన్నంగా పరిస్థితులు మారాయి. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, విజయ్.. వంటి ఏ హీరోల సినిమాలు ప్రస్తుతం తెలుగులో ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇటివల ఖైదీ మాత్రమే తెలుగులో మంచి కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం తెలుగులో వస్తున్న సినిమాలు, కంటెంట్ ను ఇతర భాషా సినిమా పరిశ్రమలు ఆసక్తిగా చూస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: