హృదయ గాయాలకి మృదుగేయ ఔషధాలను ఆర్పించిన వాక్య వైద్యుడు.. వేటూరి. ఆత్రేయలోని భావసౌందర్యాన్ని, సి.నారాయణరెడ్డిలోని భాషా పటిమను.. శ్రీశ్రీ లోని సామాజిక చైతన్య స్ఫూర్తిని రంగరించి రూపుదాల్చిన మూర్తి.. వేటూరి సుందరరామమూర్తి. తెలుగు పాటల పూదోటలో కొమ్మకొమ్మకో సన్నాయి పలికించి.. రాలేటి పూలతో రాగాలు పలికించిన చరితార్ధుడు వేటూరి. ప్రియా ప్రియతమా అంటూ ఎప్పుడూ గుండెల్లో ధ్వనిస్తూనే ఉంటాడు. తెలుగు సినిమా ఓ అందమైన పూలతోట అయితే.. ఆ పూదోటలో పెరిగిన పాటల చెట్టకు రంగు రంగుల పూలిచ్చారు. కొమ్మకొమ్మకో కోటిరాగాలనిచ్చారు. తెలుగు వారి హృదయాల్లో మల్లెలు పూయించారు.. వెన్నెల కాయించారు. పాటలమ్మ కంఠంలోని హారానికి పదాల వజ్రాలను అందంగా.. అలంకారంగా పొదిగిన పదశిల్పి ఆయన. ఎప్పుడు వెన్నెలని.. వెన్నెల్లో తడిసి ముద్దయిన గోదావరిని చూసినా ఆయన కలం ఉరకలేస్తుంది. వెన్నల్లో గోదారి అందాన్ని అంత అద్భుతంగా చెప్పారు వేటూరి. వేటూరి సుందరరామమూర్తి తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేశారు. తెలుగు పాటలమ్మకి పట్టు చీరలు తొడిగించారు. 

 


ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ.. అనురాగపు అంతులు చూపడం ఆయనకే చెల్లింది.. ఆకుచాటు తడిసిన పిందెలా.. ఆరేసుకోబోయి పారేసుకున్న జరీ చీర జిలుగులా.  చూపిన ఘనత ఆయనది.  అడవి రాముడు, శంకరాభరణం. సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఎన్నో సినిమాలు.. అజరామరమైన గీతాలు.. ఆయన కలం నుంచి జాలువారాయి. ఓ కవి చెప్పినట్లు వెన్నెల, చిరుగాలి, సెలయేరు ఎప్పుడూ ఒకేలా వుంటాయి. చూసే కన్నుల్లోనే తేడా వస్తుంది. అక్షరాలు, పదాలు, వాక్యాలు, ఎప్పుడూ ఒకేలా వుంటాయి. రాసే పెన్నులోనే తేడా వస్తుంది. వెన్నెలలో పన్నీరు పారబోసి, చిరుగాలిలో మల్లెలు ఆరబోసి, సెలయేటిలో మృదంగనాదం కల. అబ్బనీ తీయని దెబ్బ అంటూ రాసిన ఆయన కలం అద్వైత సిద్దికి వరకు అన్ని తరహా పాటలు రాసింది.. అందరూ చూసే విధంగా కాకుండా తనదైన దృష్టితో ఈ ప్రపంచాన్ని ఆయన చూసేవాడు.

 

ఆయన కలంలో అన్ని రసాలు కలగలిపిన సిరా ఉండేదేమో.. రవివర్మకు అందని అందాల్ని అందించిన భావకుడిలా.. పదాల్నితాకి కవితా గౌతమిని ప్రవహింప చేసిన భగీరధుడిలా.. చల్లగాలిలా.. మల్లెపూవులా.. ఒక చిన్న మాటతో అనంత రాగాల్ని పలికించిన వీణలా.. కొమ్మకొమ్మకో సన్నాయిలా.. ఝమ్మన్న నాదంలా.. వేణువైన భువనంలా.. గాలిలో కలసిన గగనంలా.. తెలుగు అలంకారాలతో చెడుగుడు ఆడుకున్న రచయిత వేటూరి సుందరరామమూర్తి. ఈ రోజు వేటూరి జయంతి ఈ సందర్భంగా ఆ సినీ మహాకవి మనకు అందించిన మధురమైన సినీగీతాలను ఒక సారి గుర్తుకుతెచ్చుకుందాం. ఓ సీత కధతో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన వేటూరి.. సంగీత దర్శకుల బాణీలకు రంగురంగుల పదాల వోణీలు కట్టారు. పాటకు పైటేసి సిగ్గుల మెగ్గని చేశారు. ‘సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా తిరిగే భూమాతవు నీవై…వేకువలో వెన్నెలవై కరిగే కర్పూరము నీవై…ఆశలకే హారతివై వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే..’ అంటూ అద్భుతమైన తన పదాలతో శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు వేటూరి.

 

పాటను గోదావరిలా పరవళ్లు తొక్కించారు. ఉరకలెత్తించారు. భాష భావుకతలు ఆయనకు రెండు కళ్లు. ఆయన సవ్యసాచి. ఆయన పాళికి రెండు వైపులా పదునే! మసాలాలు దట్టించి మాస్‌ను పట్టుకోగలరు. సంస్కృత సమాసాలు పట్టించి క్లాస్‌ను ఆకట్టుకోగలరు.  ‘కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు..’ అంటూ వేదాంతాన్ని ప్రేమని మానవత్వాన్ని రంగరించి రాగంలా మార్చిన వేటూరి చిరస్మరణీయుడు. ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక టూరిస్టు లాంటి వారే...ఈ లోకంలో ఆయన జీవిత ప్రయాణంలో ఆయన జీవితాన్ని ఆస్వాదించడమే కాకుండా...ఆయన జీవిత అనుభవాలను మనకు పాటలుగా మలచి ఇచ్చిన మహా రచయిత వేటూరి. మానవ సంబంధాలలోని అన్ని కోణాలను సృశించి వాటిని పాటలుగా మలిచి మీరు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇలా పాడుకుంటూ ఉండండి అంటూ పాటల పూదోటలను మనకు అందించి ఆయన రాసుకున్నట్టుగానే ఈ భూమి మీదకు వేణువుగా వచ్చి గాలి అయిపోయాడు గగనానికి. ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో ఒక పూటలోనే రాలు పూవులెన్నో.. అంటూ వేదాంతిలా వెళ్ళిపోయిన వేటూరి.. మనకు తన ఙ్ఞాపకాలు.. పాటలు.. మిగిల్చివెళ్ళారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: