క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి కొన‌సాగుతున్న‌ ‌లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త రెండు నెల‌లుగా అన్నిరంగాల కార్య‌క‌లాపాలు ఆగిపోయాయి. అయితే.. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం స‌డ‌లింపులు ఇస్తుండ‌డంతో ఇప్పుడిప్పుడే అన్నిరంగాల కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఈక్ర‌మంలోనే సినిమా, సీరియ‌ల్స్ షూటింగ్స్ కూడా త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అలాగే.. రెండు నెల‌లుగా మూత‌ప‌డిన‌ థియేట‌ర్స్ కూడా మ‌రో రెండు నెల‌ల్లో తెరుచుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే శుక్ర‌వారం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత థియేట‌ర్స్ రీ ఓపెన్‌పై కాస్త స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

 

అంత‌కుముందు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌తో కూడా చిరంజీవి, నాగార్జున త‌దిత‌ర ప్ర‌ముఖులు స‌మావేశమైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్ట్‌లో తిరిగి థియేట‌ర్స్ ఓపెన్ అవుతాయ‌నే ఓ ప్రచారం జ‌రుగుతోంది. అయితే.. ముందుగా వ‌చ్చే సినిమా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన వకీల్ సాబ్ అని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. ఏపీ రాజ‌కీయాల్లో ప‌వ‌న్ అడుగుపెట్టిన త‌ర్వాత ప‌వ‌న్ సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఇటీవ‌ల అంటే దాదాపు రెండేళ్ళ త‌ర్వాత ప‌వ‌న్ తిరిగి మేక‌ప్ వేసుకుని వ‌కీల్‌సాబ్ చేశాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వ‌కీల్ సాబ్ ముందుగా విడుద‌లైతే ప్రేక్ష‌కుల్లోనూ కాస్త జోష్ వ‌స్తుంద‌ని భావించి ఈ సినిమాని ముందుగా రిలీజ్ చేస్తార‌నే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

 

వ‌కీల్‌సాబ్‌ త‌ర్వాత అరణ్య, నిశ్శబ్దం వంటి బడా చిత్రాలు కూడా ప్రేక్ష‌కుల ముందుకు ఒక్కొక్క‌టిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. లాక్‌డౌన్ స‌మ‌యంలో కొంద‌రు నిర్మాత‌లు ఓటీటీల‌ని ఆశ్ర‌యిస్తున్నారు. ఇప్ప‌టికే ఓటీటీలో విడుద‌ల కానున్న‌ కొన్ని చిత్రాల‌కి సంబంధించి రిలీజ్ డేట్‌లు కూడా ప్ర‌క‌టించారు. రానున్న రోజుల్లో ఓటీటీ వేదిక‌గానే సినిమాలు ఎక్కువ‌గా విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు నిపుణులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ముందుముందు ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: