టాలీవుడ్ దర్శక దిగ్గజాల్లో ఒకరైన కె రాఘవేంద్ర రావు గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు తన కెరీర్ లో మొత్తంగా 100కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి శతాధిక చిత్రాల దర్శకేంద్రుడిగా టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకున్న రాఘవేంద్ర రావు, మధ్యలో అక్కడక్కడా కొన్ని హిందీ సినిమాలు కూడా తీయడం జరిగింది. మొత్తంగా తన సినిమా కెరీర్ లో లెజెండరీ హీరో ఎన్టీఆర్ దగ్గరి నుండి నేటి యువ హీరో నితిన్ వరకు దాదాపుగా ఎందరో నటులతో కలిసి పనిచేసిన గొప్ప అనుభవం రాఘవేంద్ర రావు సొంతం. 1942, 23 మేన కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామంలో జన్మించిన రాఘవేంద్ర రావు తండ్రి కోవెలమూడి ప్రకాశరావు కూడా ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు కావడం విశేషం. 

 

తండ్రి మాదిరిగా దర్శకుడిగా చిత్ర సీమకు అడుగుపెట్టిన రాఘవేంద్ర రావు, తొలిసారిగా 1975లో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి ల కలయికలో రూపొందిన బాబు సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని దర్శకుడిగా మంచి పేరుని దక్కించుకున్న రాఘవేంద్ర రావు, ఆ తరువాత నుండి వరుసగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక తన కెరీర్ లో ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణ లతో ఎన్నో భారీ హిట్స్ అందుకున్న రాఘవేంద్ర రావు, నేటి స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లను టాలీవుడ్ కి హీరోలుగా పరిచయం చేయడం జరిగింది. అలానే హిందీలో ధర్మేంద్ర, జితేంద్ర, హేమమాలిని వంటి దిగ్గజ నటులతో కూడా ఆయన పనిచేసారు. ఇకపోతే రాఘవేంద్ర రావు తీసిన సినిమాల్లో వేటగాడు, అడవిరాముడు, అమరదీపం, పదహారేళ్ళ వయసు, ఊరికిమొనగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, శక్తి, బొబ్బిలి బ్రహ్మన్న, అగ్నిపర్వతం, అపూర్వ సహోదరులు, కలియుగ పాండవులు, మంచి దొంగ, కూలి నెంబర్ వన్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, ఘరానా బుల్లోడు, బొంబాయి ప్రియుడు, పెళ్లి సందడి, అన్నమయ్య, రాజకుమారుడు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. 

 

1984లో కృష్ణంరాజు హీరోగా ఆయన తీసిన బొబ్బిలి బ్రహ్మన్న సినిమాకు గాను రాఘవేంద్ర రావుకు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు లభించింది. అలానే 2015లో ఆయనకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం కూడా లభించడం విశేషం. అనంతరం మరికొన్ని అవార్డులతో పాటు 2016లో ప్రముఖ హాస్యనటుడు అల్లురామలింగయ్య పేరిట ఇవ్వబడే ప్రఖ్యాత అవార్డును కూడా అందుకున్న రాఘవేంద్ర రావు, నేడు జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఎందరో సినిమా ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విషెస్ ని తెలియచేస్తున్నారు. ఈ విధంగా దర్శకుడిగా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసి మంచి పేరు గడించిన రాఘవేంద్ర రావు రాబోయే రోజుల్లో మరింత ఆరోగ్యం, ఆనందంతో జీవించాలని పలువురు సినీ అభిమానులు కోరుతూ మెసేజెస్ చేస్తన్నారు.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: