అందాల తార సీనియర్ నటి శ్రీదేవి పెద్ద కూతురు అయిన జాన్వికపూర్ ధడక్ అనే రొమాంటిక్ డ్రామా సినిమా ద్వారా సినీ ప్రేక్షకులకు కథానాయకిగా పరిచయం అయింది. ఆ సినిమా తర్వాత తాను కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే కాకుండా గుంజన్ సక్సేనా, కార్గిల్ గర్ల్, గోస్ట్ స్టోరీస్ లాంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రల్లో నటించి అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఇప్పటివరకు కేవలం హిందీ సినిమాలకు మాత్రమే పరిమితమైన జాన్వికపూర్ తెలుగు సినిమాలలో అరంగేట్రం చేస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. 


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ సరసన జాన్వికపూర్ నటించబోతుందని అప్పట్లో ప్రచారం బాగానే జరిగింది. పూరి జగన్నాథ్ కరణ్ జోహార్ తో మాట్లాడి జాన్వికపూర్ ని తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలనే అనుకున్నాడు కానీ ఆమె మాత్రం నో చెప్పేసింది. దాంతో మీడియా వాళ్లు జాన్వికపూర్ కి తెలుగులో నటించడం ఇష్టం లేదని ప్రచారం జోరుగా చేశారు. ఈ విషయంపై బోనికపూర్ క్లారిటీ ఇస్తూ... జాన్వికపూర్ మిగతా సినిమా షెడ్యూల్ లలో బాగా బిజీ గా ఉండి ఫైటర్ చిత్రానికి నో చెప్పిందని పుకార్లకు చెక్ పెట్టాడు. 


అయితే తాజాగా మళ్ళీ జాన్వికపూర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుగు పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటించబోతోందట. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శిరీశ్, దిల్ రాజుతో పాటు బోనికపూర్ కూడా నిర్మిస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే. అయితే తన సొంత సినిమా అయిన వకీల్ సాబ్ లో జాన్వికపూర్ ని నటింపజేయాలని దిల్ రాజు బోని కపూర్ ను అడిగారట. దాంతో బోనీకపూర్ జాన్వికపూర్ ని ఈ సినిమాలో నటించేలా ఒప్పించారని బలంగా టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా త్వరలోనే దిల్ రాజు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: