అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప్ర‌స్తుతం ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క.. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున్ హీరోగా తెర‌కెక్కిన `సూపర్` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత మహానంది సినిమాలో న‌టించినా.. పెద్దగా క్రేజ్ ద‌క్క‌లేదు. అయితే రాజమౌళి రవి తేజా కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు  చిత్రంతో అనుష్కకు ఫ‌స్ట్ స‌క్సెస్ అంద‌డ‌మే కాకుండా.. ఈమె క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇక ఆ త‌ర్వాత జ‌ట్ స్పీడ్‌లో సినిమాలు చేసుకుంటూ సూప‌ర్ డూప‌ర్ హిట్లు అందుకుంది. 

 

అయితే ఎన్ని సినిమాలు చేసినా.. అనుష్క కెరీర్ మ‌రో మ‌లుపు తిప్పిన సినిమా `అరుంధతి`. ఈ సినిమా వ‌ల్ల 2009లో అనుష్క కెరీర్ పూర్తిగా మారిపోయింది. కోడి రామకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క హీరోయిన్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఘ‌న విష‌యం సాధించింది. హారర్ మూవీలలో అరుంధతి ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది. మ‌రో విష‌యం ఏంటంటే.. 100కు పైగా చిత్రాలు తీసిన కోడి రామకృష్ణ దర్శత్వంలో చివరగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం అంటే అరుంధతినే. ఈ చిత్రంతో అప్పటివరకు గ్లామర్ హీరోయిన్ గా ఉన్న అనుష్క ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

 

డార్క్ ఫాంట‌సీ హార‌ర్ ఫిల్మ్ గా రూపొందిన ఈ సినిమాని మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. అరుంధతిగా అనుష్క రెండు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసింది. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క వైవిధ్య నటన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అందుకే అరుంధతి అంటే అనుష్క, అనుష్క అంటే అరుంధతి అంటారు చాలా మంది. అంతగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది ఆ సినిమా. ఇక అనుష్క కోసమే ఆ పాత్ర పుట్టుకొచ్చిందా? అనే సందేహం కలగకమానదు. 

 

అయితే వాస్త‌వానికి అరుంధ‌తి సినిమాకు అనుష్క‌ను తీసుకోవ‌డంలో కోడి రామకృష్ణ ముఖ్య పాత్ర పోషించారు. అనుష్క గ్లామర్ హీరోయిన్.. ఇది ఎమోషన్ తో కూడుకున్న పాత్ర.. ఆ అమ్మాయి చేయలేదు అని ఎంత మంది చెప్పిన‌ప్ప‌టికీ కోడి రామకృష్ణ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. అనుష్క‌నే ఎంచుకున్నారు.  ఇక వెండితెరపై జేజెమ్మ అరుంధతిగా అనుష్క విశ్వరూపం గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏదేమైనా కోడి రామకృష్ణతో అనుష్క జ‌త క‌ట్ట‌డం వ‌ల్ల‌.. ఈ సినిమా ఆమె కెరీర్‌కే ట‌ర్నింగ్ పాయింట్‌గా మారింద‌ని చెప్పుకోవాలి.

  
 

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: