దివంగత స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ గారి చిన్న కొడుకుగా ఎంట్రీ ఇచ్చి వెండితెర‌పై గ‌త కొన్నేళ్లుగా త‌న‌దైన హాస్యంతో ఆక‌ట్టుకుంటూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో అల్ల‌రి న‌రేష్‌. తన కెరీర్లో ఇప్పటి వరకు 55 చిత్రాలను పూర్తి చేసిన నరేష్ తన మొదటి సినిమా 'అల్లరి'తో 'అల్లరి నరేష్'గా మారిపోయారు. హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలాంటి వాటిలో 'బెండు అప్పారావు' 'బ్లేడ్ బాబ్జీ' 'సీమ శాస్త్రి' 'అత్తిలి సత్తిబాబు' 'కితకితలు' 'కత్తి కాంతారావు' 'మహర్షి' సినిమాల్లో అల్లరి నరేష్ నటన అద్భుతమని చెప్పవచ్చు. ఇప్పటికీ చిన్న నిర్మాతలకు వరంగా పెద్ద దిక్కుగా ఉంటున్నాడు మన అల్లరోడు. నరేష్ ప్రస్తుతం ‘నాంది’ అనే ప్రయోగాత్మక సినిమాలో నటిస్తున్నాడు. ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరచయమవుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రధారులు పోషిస్తున్నారు. 

 

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైయ్యాయట. అల్లరి నరేష్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్స్ సినిమా పై విపరీతమైన ఆసక్తిని పెంచాయి. ఎక్కువగా కామెడీ జానర్లో సినిమాలు చేసే నరేష్ అప్పుడప్పుడు ఇలాంటి ఇంటెన్స్ చిత్రాలను కూడా టచ్ చేస్తుంటారు. గతంలో కూడా ‘నేను' 'విశాఖ ఎక్స్ ప్రెస్' 'గమ్యం' 'శంభో శివ శంభో' లాంటి చిత్రాలతో మెప్పించిన నరేష్ చాలా రోజుల తర్వాత అలాంటి కథతో చేస్తున్న సినిమానే ఈ ‘నాంది’. ఈ సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలు కూడా ఉండనున్నాయి. మరి గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వస్తోన్న అల్లరి నరేష్ ఈ వినూత్నమైన సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: