దేశంలో లాక్డౌన్ మొదలయినప్పటి నుండీ జనాలంతా వినోదం కోసం ఓటీటీ వైపే చూస్తున్నారు. థియేటర్లు మూతబడిపోవడంతో ఇక చేసేదేమీ లేక ప్రతీ ఒక్కరూ డిజిటల్ వేదికగానే సినిమాలని, వెబ్ సిరీస్ లని చూస్తూ కాల గడుపుతున్నారు. ఆ భాషా, ఈ భాషా అని తేడాల్లేకుండా ఏ భాషలో నచ్చితే  భాషలో చూసేస్తున్నారు. అందుకే ఆల్రెడీ రిలీజ్ కి దగ్గరపడ్డ చిత్రాలని వాయిదా వేయడం కంటే ఓటీటీలో రిలీజ్ చేయడమే ఉత్తమం అని భావిస్తున్నారు.

 

ఇప్పటికే హిందీలో చిన్న సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. తెలుగులోనూ అమృతరామమ్ సినిమా జీ౫ ద్వారా విడుదలైంది. సినిమాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ఓటీటీ వేదికగా వెబ్ సిరీస్ లని తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లు తెలుగులోనూ బాగా పెరుగుతున్నాయి. తాజాగా యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

 


అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన ఈ నటుడు, ఆ తర్వాత సుశాంత్ హీరోగా వచ్చిన చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత తెరకెక్కించిన మన్మధుడు ౨ మాత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అనిపించుకుంది. అయితే ప్రస్తుతానికి వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉన్నాడట.

 

వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ఈ సినిమాని రూపొందించనుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకి వెల్లడి కావాల్సి ఉంది. తెలుగు వెబ్ సిరీస్ లలో మంచి కంటెంట్ రావట్లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ రవీంద్ర తెరకెక్కించనున్న ఈ వెబ్ సిరీస్ తోనైనా ఆ విమర్శలని తిప్పి కొడతాడెమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: