కరోనా మహమ్మారి మానవాళి జీవనశైలినే మార్చేసింది. పేదల జీవితాలను అతలాకుతలం చేసింది. రోజువారీ వేతనాలకు పనిచేసే ఎంతో మంది కార్మికుల పొట్టకొట్టింది. ఈ మహమ్మారి వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న లాక్‌ డౌన్ కార‌ణంగా చిత్ర‌సీమ పూర్తిగా స్తంభించింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో దిన‌స‌రి వేతనం పొందే శ్రామికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేసుకోలేని పరిస్థితి. వీరికి అండ‌గా టాలీవుడ్ సినీ ప్రముఖుల నేతృత్వంలో క‌రోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) అనే సంస్థ కూడా ఏర్పాటైన విష‌యం తెలిసిందే. ఈ ఛారిటీ ద్వారా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మ‌రోవైపు కొంద‌రు ప్ర‌ముఖులు కూడా సినీ కార్మికులకి త‌మ వంతు సాయం చేస్తున్నారు. సినిమా రంగంలో ఉన్న ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న కార్మికులందరికీ ఈ చారిటీ ద్వారా నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే, సూపర్ మార్కెట్లలో సరుకులు కొనుక్కోవడానికి కూపన్లు అందజేశారు. అయితే, ఆయా సంఘాల్లో లేకుండా సినిమా రంగంలో పనిచేసే మహిళలు, లైట్‌మన్‌లు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికి ఎలాంటి సాయం అందలేదు. ఈ విషయం తెలుసుకున్న నటుడు జగపతిబాబు వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు.

 

సినిమా నిర్మాణ పనులు లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు, లైట్‌మన్‌లకు సోమవారం జగపతిబాబు తన వంతు సహాయాన్ని చేసాడు. ఇందులో భాగంగా 400 మందికి బియ్యం, ప‌ప్పు, నూనె, మాస్క్‌లు ఇచ్చారు. ఆ మ‌ధ్య క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌ డౌన్‌ని ప‌క‌డ్భందీగా నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కి జ‌గ‌ప‌తి బాబు ఎన్‌–95 మాస్కులు, శానిటైజర్లను అందించిన విష‌యం తెలిసిందే. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి వాటిని అందించారు. విప‌త్క‌ర కాలంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ముందు జాగ్రత్తగా వీటిని అందించినట్లు జగపతిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రంలో ప్రొడక్షన్ మేనేజర్, భారతీయ జనతా పార్టీ నాయకుడు చంద్ర మధు, జగపతి బాబు మేనేజర్ మహేష్, సహాయకుడు రవి పాల్గొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: