ఈ మద్య దేశంలో కరోనాతో కష్టాలే కాదు.. సినీ రంగంలో బాధలు కూడా మొదయ్యాయి. ఓ వైపు లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ పూర్తిగా ఆగిపోయాయి.. విడుదల అయ్యే చాన్స్ లేవు.. థియేటర్లు మూసివేశారు. మొత్తానికి సినీ రంగంలపై కరోనా ఎఫెక్ట్ దారుణంగా పడింది. ఇది చాలదన్నట్టు వరుస విషాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.  గత నెల ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ కన్నుమూశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మళియాళ సినీ రంగానికి చెందిన వారు కన్నుమూశారు.  తాజాగా కన్నడ బుల్లితెర వర్ధమాన నటి మెబీనా మైఖేల్ (22) నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మోడల్‌గా కెరియర్ ప్రారంభించిన మెబీనా..  ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో టైటిల్‌ కైవసం చేసుకుని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

 

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆమె.. తాజా సడలింపుల నేపథ్యంలో స్వగ్రామం మెడికెరికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రయాణిస్తున్న కారు దేవీహళ్లి వద్ద అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెబీనాతోపాటు ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆమె మృతి చెందగా, మెబీనా స్నేహితులు కోలుకుంటున్నారు.

 

 అప్పటి వరకు ఎంతో సంతోషంతో ప్రయాణం చేసిన మెబీనా కన్నుమూయడం ఒక్కసారే అందరి హృదయాలు కలిచి వేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెళ్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే కన్నడ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలిసిన ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో హోస్ట్ అకుల్ బాలాజీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఫేవరెట్ కంటెస్టెంట్ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. చాలా చిన్న వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని, ఈ నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: