నందమూరి తారక రామారావు.. తెలుగువారి కీర్తిని, ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన ఈయ‌న‌ ప్రతి ఒక్క‌రికీ స్ఫూర్తి‌దా‌యకం. తెలుగు పరిశ్రమలో అగ్రకథానాయకుడిగా నీరాజనాలందుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ రంగంలోనూ అడుగిడి ప్రజలకు తనవంతు సేవచేసి తెలుగు ప్రజల మదిలో ఆరాధ్య దైవమయ్యారు ఎన్టీఆర్‌. పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా పాత్ర ఏదైనా, సంభాషణలు ఎలాంటివైనా అద్భుత నటనతో రక్తి కట్టించడంలో ఎన్టీఆర్ మ‌హా దిట్ట‌. అందుకే ఎన్టీఆర్ బహుముఖ ప్రఙ్ఞాశాలి అని అంటారు. అలాంటి ఎన్టీఆర్ ఓ సినిమాలో ఒక్క సీన్ కోసం కోర్టులో మూడేళ్ల పాటు పోరాటం చేశాడు. 

 

అదే `శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర` సినిమా. ఆంధ్ర దేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రాచుర్యంలో ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే కాలజ్ఞానిగా ప్రసిద్ధుడైన ఈ యోగిపురుషుని జీవి కథను నందమూరి తారకరామారావు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌టించ‌డ‌మే కాకుండా.. ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించాడు. వాస్త‌వానికి 1980లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమై, 1981లో పూర్తయింది. అయితే విడుదల అంత సులభం కాలేదు. ఎందుకంటే.. ఈ సినిమాలోని ఒక సీన్ ని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే.. మూడేళ్లు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు ఎన్టీఆర్‌. 

 

షూటింగ్ పూర్తి అయిన మూడేళ్ల‌కు ఈ చిత్రం 1984 నవంబర్‌ 29న విడుదలై ఘనవిజయం సాధించింది. ఇక్క‌డ మ‌రో అద్భుత‌ విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో `తెరమీద బొమ్మలు... రాష్ట్రాలేలతాయి` అన్న దానికి ఉదాహరణగా తాను గౌరవించే ఎం.జి.రామచంద్రన్‌ను చూపించారు. అందులో ఎన్టీఆర్‌ కూడా సీఎం అవుతారన్న అర్థం ఉందన్న వాదనను కొందరు నాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ చెవినవేశారు. దీంతో ఆ సినిమాకు ఏడాదిపాటు మద్రాసులో ఉన్న సెన్సార్‌ బోర్డువారు క్లియరెన్స్‌ ఇవ్వలేదు. చివరికి ఆ సినిమా విడుదలయ్యేనాటికి... ఎన్టీఆర్‌ నిజంగానే సీఎం పీఠం అధిరోహించారు. అలా ఎన్టీయార్ రాజకీయాలలోకి వచ్చిన కొద్దికాలానికే ఈ సినిమా భారీ అంచనాలతోను, కొన్ని వివాదాలతోను, రాజకీయ దుమారంతోను విడుదలై.. సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: