లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సినిమా షూటింగ్స్ పునఃప్రారంభంపై ఇటివల మంత్రి తలసాని ఆధ్వర్యంలో చిరంజీవితో పాటు సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. కొన్ని మార్గదర్శకాలతో త్వరలోనే షూటింగ్స్ కు అనుమతిస్తామని సీఎం ప్రకటించారు. అయితే.. ఈ సమావేశాలకు తనకు పిలుపు రాలేదని.. జరిగిన విషయాలన్నింటినీ తాను మీడియాలో చూసే తెలుసుకున్నానని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఇండస్ట్రీలో ఉన్న గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయని.. బాలకృష్ణకు అవమానం జరిగిందంటూ వచ్చిన వార్తలపై కల్యాణ్ స్పందించారు.

 

 

‘బాలకృష్ణను ఎవరూ అవమానించట్లేదు. ఆ మాట కరెక్ట్ కాదు. షూటింగ్స్ పునఃప్రారంభం కోసం నిర్మాతలుగా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఎవరి స్థాయిలో పలుకుబడి వారు ఉపయోగిస్తున్నారు. చిరంజీవిని బాధ్యత తీసుకోమని మేమే అడిగాం. ఇక్కడ ఎవరున్నారన్నది ముఖ్యం కాదు.. సినీ పరిశ్రమకు మేలు జరగడం ముఖ్యం. సమావేశాలకు తాము ప్రత్యేకించి ఎవరినీ పిలవలేదు. బాలకృష్ణ వస్తానంటే ఎవరు కాదంటారు. పైగా.. బాలకృష్ణ నిర్మాతగా ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు. అవసరమైనప్పుడు మాత్రమే బాలయ్య వస్తారు. ప్రతి విషయాన్ని తానే బాలకృష్ణకు చెప్తూంటాను. ఇక్కడ తామంతా ఒకటే. ఇండస్ట్రీలో గ్రూపులున్నాయనే వాదన సరికాదు. ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం ఉంటుంద’ని అన్నారు.

 

 

అయితే బాలకృష్ణ స్పందన వేరేలా ఉంది. ‘సినీ పరిశ్రమ పునఃప్రారంభంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని.. జీవో వస్తే జూన్ రెండో వారం నుంచి షూటింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న సినిమాలకు ముందు అవకాశం ఇవ్వాలని సూచించా’నని చెప్పుకొచ్చారు.. బాలయ్య చెప్పినట్టు చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి పిలుపు అందలేదా.. సీఎం కేసీఆర్ ను కలిసినప్పుడు పిలుపు అందలేదో కానీ బాలయ్య మాటలు ఇండస్ట్రీలో సెగలు రేపాయి. మరి.. ఈ విషయంలో ఎవరి వాదన నిజమో ఇండస్ట్రీ వర్గాలకే తెలియాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: