లాక్ డౌన్ వల్ల సినీ ప్రియులంతా కూడా ఓటిటిల మీద పడుతున్నారు. రానున్న రోజుల్లో చిన్న సినిమాలు కొన్ని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనిపిస్తుంది . కరోనా ప్రభావంతో లాక్ డౌన్ టైం లో కొత్త సినిమాల కోసం వెతికే సినీ లవర్స్ కు ఆహాలో ఈరోజు రిలీజైన వెబ్ మూవీ. నవదీప్, పూజిత పొన్నాడ జంటగా నటించిన ఈ సినిమాను లక్ష్మీకాంత్ చెన్నా డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.    

 

కథ :

 

సందీప్ (నవదీప్), శృతి కొత్తగా పెళ్ళైన జంట.. ఇద్దరు ఎంతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటారు. వెడ్డింగ్ యానివర్సరీ రోజు నవదీప్ కు షాక్ ఇస్తూ శృతి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన పోలీసులు ఇంటరాగేషన్ మొదలుపెడతారు. ఆమెది సూసైడ్ కాదు మర్డర్ అని తెలుసుకుంటారు. శృతి భర్త సందీప్ కావాలని ఆమెను చంపాడని అనుమానిస్తారు. అయితే తన భార్యను హత్య చేసిన వారి గురించి వెతకడం మొదలుపెడతాడు సందీప్. ఇంతకీ శ్రుతిని చంపింది ఎవరు..? సందీప్, శృతి లైఫ్ లో వచ్చిన ఆ మూడో వ్యక్తి కథ ఏంటి..? శృతి ది ఆత్మహత్య..? హత్య..? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆహాలో 'రన్' సినిమా చూడాల్సిందే.     

 

విశ్లేషణ :

 

కన్నడ డైరక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా ఎంచుకున్న కథ బాగుంది. అయితే దాన్ని నడిపించిన విధానం చాల కన్ ఫ్యూజన్ తో సాగింది. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న భార్య భర్తలు.. అందులో ఏవో కారణాల వల్ల భార్య సూసైడ్ చేసుకోవడం.. పోలీసుల విచారణలో అది సూసైడ్ కాదు మర్డర్ అని తేలడం.. దానికి భర్తే కారణం అని అనుమానించడం.. ఇలా మూవీ మొదలై ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు అనిపించిన సినిమాను సెకండ్ హాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పించేశాడు డైరక్టర్. 

 

మర్డర్ మిస్టరీని సస్పెన్స్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలో సైకో థ్రిల్లర్ ను తెచ్చి కన్ ఫ్యూజ్ చేశాడు. బహుశా డైరక్టర్ ఆడియెన్స్ ను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేద్దామని అనుకున్నాడు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అంతేకాదు ఇలాంటి కథలు రాసుకున్నప్పుడు బాగా అనిపిస్తాయి కానీ తెరకెక్కించే విధానం బాగాలేకపోతే తేలిపోతాయి. రన్ విషయంలో దర్శకుడు కూడా అదే మిస్టేక్ చేశాడు. 

 

ఈ వెబ్ మూవీ ట్రైలర్ చూసి నిజంగా సస్పెన్స్ తో ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తుందని అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. సినిమాను నడిపించడానికి కొన్ని అవసరం లేని పాత్రలను కూడా తీసుకున్నాడు. తెలుగులో రిలీజ్ ఆయిన్ మొదటి వెబ్ మూవీ అది కూడా తెలుగు ఓటిటి ఆహాలో రిలీజైన మొదటి సినిమా ఇది. సినిమా క్వాలిటీ, మేకింగ్ అంతా బాగున్నా సరైన కథ, కథనాలు లేకపోవడంతో ప్రేక్షకులను నిరాశపరచే అవకాశం ఉంది. 

 

నటీనటుల ప్రతిభ :

 

సినిమాలో సందీప్ పాత్రలో నటించిన నవదీప్ చాలా పరిణితి చెందాడని చెప్పొచ్చు. పాత్రకు తగినట్టుగా తన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఇక హీరోయిన్ పూజిత పొన్నాడది తక్కువ పాత్రే.. అయినా పర్వాలేదు అన్నట్టుగా చేసింది. వెంకట్ పోలీస్ ఆఫీస్ గా కనిపించి మెప్పించాడు. అమిత్ త్రివేది పాత్ర అలరించింది. సినిమాలో ఇంకొన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. 

 

సాంకేతికవర్గం పనితీరు :

 

నరేష్ కుమరన్ మ్యూజిక్ సినిమాకు ఆ సస్పెన్స్ మూడ్ క్రియేట్ అయ్యేలా చేసింది. సాంగ్స్ లేకపోయినా తన బీజీఎమ్ తో మెప్పించాడు. ఇక సజీశ్ రాజేంద్రన్ కెమెరా వర్క్ బాగుంది. సినిమాలో బాగుంది అని చెప్పుకోవాల్సి వస్తే అది కెమెరా మెన్ పనితనం అని చెప్పొచ్చు. లక్ష్మీకాంత్ చెన్నా రాసుకున్న కథ, కథనాలు మెప్పించలేదు. సస్పెన్స్, సైకో థ్రిల్లర్ రెండిటిని కలిపి కొత్తగా ట్రై చేయాలని చూశాడు కానీ వర్క్ అవుట్ కాలేదు. ఆహా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

 

ప్లస్ పాయింట్స్ :

 

ఫస్ట్ హాఫ్ సీన్స్ 

 

కెమెరా వర్క్ 

 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 

 

మైనస్ పాయింట్స్ :

 

డైరక్షన్ 

 

అవసరం లేని పాత్రలు 

 

క్లైమాక్స్ 

 

బాటమ్ లైన్ :

 

రన్.. 'ఆహా' అనిపించలేదు..!

 

రేటింగ్ : 2/5 

 

మరింత సమాచారం తెలుసుకోండి: