గత రెండు రోజులుగా చిరంజీవి ఇంట్లో సమావేశం జరపడంపై బాలయ్య చేసిన వ్యాఖ్యల గురించి తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండగా చిరంజీవి ప్రస్తుతం ఆ బాధ్యతలను మోస్తున్నారు. . చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేకపోయినా ఈ వివాదం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. ఇండస్ట్రీలో కొందరు బాలయ్య వ్యాఖ్యలకు మద్దతు ఇస్తుంటే మరికొందరు మాత్రం బాలయ్య వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. 
 
అయితే ఫిల్మ్ నగర్ వర్గాల్లో చిరంజీవి వ్యతిరేకులు ఆలోచించాల్సిన విషయం ఒకటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ వివాదంలో తల దూరుస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వ్యక్తిగతంగా బాలకృష్ణను చిరంజీవి విమర్శించిన సందర్భాలు లేవు. అభిమానుల్లో కూడా రెండు దశాబ్దాల క్రితం అభిమానులకు, ప్రజెంట్ జనరేషన్ అభిమానులకు ఆలోచనా తీరులో చాలా మార్పు వచ్చింది. 
 
సినీ విశ్లేషకులు చిరంజీవి లీడ్ తీసుకుంటే అటు కేసీఆర్ తో, ఇటు జగన్ తో సన్నిహితంగా మెలుగుతున్నాడు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవని... బాలకృష్ణ లీడ్ తీసుకుంటే కేసీఆర్ తో ఎలాంటి సమస్యలు లేకపోయినా జగన్ తో రాజకీయ విభేదాలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. జగన్ గతంలో బాలకృష్ణ అభిమాని అయినప్పటికీ బాలకృష్ణ పలు సందర్భాల్లో వైసీపీపై విమర్శలు చేయడం ఆయనకు నెగిటివ్ గా మారుతోంది. 
 
ఇండస్ట్రీలో కరోనా విషయంలో చిరంజీవి లీడ్ తీసుకుని కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేయడం... ఛారిటీ ద్వారా సినీ పరిశ్రమపై ఆధారపడిన వారిని ఆదుకోవడం తెలిసిందే. చిరంజీవి లీడ్ తీసుకోవడం వల్ల కొన్ని రోజుల క్రితం ఏపీ సర్కార్ షూటింగులకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటన చేసింది. తాజాగా తెలంగాణ సర్కార్ నుంచి కూడా షూటింగ్ లకు అనుకూలంగా ప్రకటన వెలువడింది. ఇలాంటి సమయంలో చిరంజీవిని అభినందించకపోయినా పరవాలేదని... తిట్టాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: