ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సినీ సెలబ్రెటీల పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టించి వివాదస్పద పోస్టులు చేస్తున్నారు. హీరోయిన్స్ పేర్లతో సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి అశ్లీల చిత్రాలు వీడియోలు ఫోటోలు పెడుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సెలబ్రిటీల ట్వీట్స్ కి వల్గర్ గా కామెంట్స్ పెడుతూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పటికే విలక్షణ నటుడు రావు రమేశ్‌ పేరుతో ట్విటర్‌ లో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై.. టాలీవుడ్‌ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వివాదస్పదంగా ట్వీట్లు చేశారు. క్షణాల్లోనే ఈ ట్వీట్లు వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ ట్వీట్లపై రావు రమేశ్‌ స్పందించారు. ''సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చిన పోస్టులకు నాకెలాంటి సంబంధం లేదు. నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్‌ క్రియేట్ చేసి.. పోస్టులు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా'' అని రావు రమేష్‌ మీడియాకు వెల్లడించారు. 

 

ఇప్పుడు లేటెస్ట్ గా నటుడు ఉత్తేజ్‌ కూడా నకిలీ అకౌంట్ల సమస్య బారిన పడ్డారు. ఆయన పేరుతో ఫేక్‌ ట్విటర్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి పలు అ‍భ్యంతకర పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్లపై ఉత్తేజ్‌ స్పందించారు. ''నమస్తే..!! సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నాకు ట్విటర్ అకౌంట్ లేనే లేదు. నా పేరుతో వస్తున్న తప్పుడు వార్తల్ని ఖండిస్తున్నాను. సంఘంలో ఓ అస్తిత్వం, వ్యక్తిత్వం లేని వాళ్లు మాత్రమే ఇలాంటి చీప్ ట్రిక్స్ తో వాగుతుంటారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాను'' అని ఉత్తేజ్ మీడియాకు వివరించారు. ఇక నకిలీ ఆకౌంట్లపై టాలీవుడ్‌ ప్రముఖులు అందోళన చెందుతున్నారు. కేవలం సినీ సెలబ్రెటీల పేరు మీదనే కాకుండా రాజకీయ నాయకుల పేర్లతో కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఫేక్ అకౌంట్స్ ఏరి వేస్తున్నా కొత్తవి పుట్టుకొని వస్తూనే ఉన్నాయి. నకిలీ ఖాతాలను నియంత్రించేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: