కరోనా కేసుల విషయంలో భారత్ ప్రపంచ స్థాయిలో 9వ స్థానికి చేరుకొని ఏకంగా రోజుకు 7వేల కేసుల చొప్పున పరుగులు తీస్తున్న పరిస్థితులలో ఇండియాలో రాబోతున్న జూన్ జూలై నెలలలో కరోనా విశ్వరూపం కనిపించబోతోంది అంటూ అంచనాలు వస్తున్నాయి. దీనితో ప్రభుత్వాలు కూడ ఏమిచేయలేక ఎవరి జాగ్రత్తలను వారినే తీసుకోమని సంకేతాలు ఇస్తున్నాయి.


ఈపరిస్థితుల నేపధ్యంలో ధియేటర్లు తిరిగి తెరుచుకునే విషయంలో ఇప్పట్లో ప్రభుత్వాల నుండి అనుమతులు రావడం కష్టం అనీ ఒకవేళ ధియేటర్లు తెరుచుకున్నా జనం కరోనా భయంతో ధియేటర్లకు రారు అన్న స్పష్టమైన సంకేతాలు నిర్మాతలకు వస్తున్నాయి. దీనితో ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న అనేక సినిమాలను ఒటీటీ సంస్థల ద్వారా విడుదల చెద్దామా లేదంటే వేచి చూద్దామా అన్న విషయం పై నిర్మాతలు ఎటూ తేల్చుకోలేక పోతున్నారని వార్తలు వస్తున్నాయి.


ఇప్పటికే సినిమాలకు సంబంధించి నిర్మాతలు పెట్టిన పెట్టుబడి పై వడ్డీల భారం రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితులలో ఈవడ్డీల సమస్యల నుండి తప్పించుకోవడానికి ఒటీటీ సంస్థలకు తమ సినిమాలను అమ్మాలని అనేకమంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నా ఒటీటీ సంస్థలు చేస్తున్న బేరసారాలకు తలలు పండిన నిర్మాతలు కూడ షాక్ అవుతున్నట్లు టాక్. ముఖ్యంగా రిలీజ్ కు రెడీగా ఉన్న ‘వి’ ‘నిశ్శబ్దం’ ‘రెడ్’ ‘అరణ్య’ ఉప్పెన’ ‘ఒరేయ్ బుజ్జిగా’ ’30 రోజులలో ప్రేమించడం ఎలా’ సినిమాలతో పాటు ఇంకా అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉండటంతో ఈసినిమాల నిర్మాతల ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిని పెరిగిపోతున్న వడ్డీల భారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఒటీటీ సంస్థలలో ప్రముఖమైన అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లు ప్రయత్నిస్తున్నాయి.


దీనితో తాము పెట్టిన పెట్టుబడిలో కనీసం రెండు వంతులు కూడ తిరిగి వచ్చే పరిస్థితి ఒటీటీ సంస్థల బేరసారాలతో లేకపోవడంతో జరుగుతున్న పరిణామాలలో ఏమిచేయాలో తెలియక మధన పడిపోతున్న ప్రస్తుత నిర్మాతల పరిస్థితిని చూసి భవిష్యత్ లో సినిమాలను నిర్మించాలి అని ఆలోచన చేసేవారు అంతా వెనకడుగు వేస్తారు అంటూ ఇండస్ట్రీ వర్గాలు అయోమయ పరిస్థితులు కొనసాగుతున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: